వరుసగా 23వ నెల.. వంద కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రతీరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే, భక్తులతో తిరుమల గిరులు కళకళలాడుతుంటాయి.. తిరుమలకు వచ్చే భక్తులు భారీగా శ్రీవారి కానుకలు సమర్పిస్తుంటారు.. హుండీలో తమ కానుకలు వేస్తుంటారు.. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా ప్రతీ రోజు కోట్లలో ఆదాయం వస్తుంటుంది. ఇక, తిరుమల వెంకన్నకు వరుసగా గత నెలలో కూడా ఆదాయం వంద కోట్ల మార్క్‌ని దాటింది.. వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రావడం ఇది వరుసగా 23వ నెల కావడం విశేషం.. మొత్తంగా జనవరి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లుగా వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అయితే, గత ఏడాది జనవరితో పోలిస్తే మాత్రం మొత్తంగా 7 కోట్ల రూపాయలు తగ్గింది శ్రీవారి హుండీ ఆదాయం.
ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారని అన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబ్‌ఆర్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్ నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని సీఎం అన్నారు. గత పదేండ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీస్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు. యువతీ, యువకులను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేయాలన్నారు. రోజురోజుకు సైబర్ క్రైమ్స్ అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టెందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
హైదరాబాద్‌లో మరో విషాదం..చిన్నారిపై దాడి చేసి చంపేసిన వీధి కుక్కలు
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కుక్క కాట్లకు ఓ చిన్నారి బలైంది. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని రోడ్డుపై లాక్కేలి చంపేశాయి. నిండు నూరేళ్లు జీవితాని సంవత్సరానికే పొట్టన పెట్టుకున్నాయని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ నిద్రిస్తున్న సమయంలో సంవత్సరం వయస్సు ఉన్న పెద్ద కుమారుడు నాగరాజును 20 కుక్కలు ఒకేసారి పాసివికంగా దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఇదంతా తల్లిదండ్రులు గమనించలేకపోయారు. కాసేపటికి పక్కన చిన్నారి కనిపించక పోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికినా ఎక్కడ కనిపించలేదు. చివరకు రోడ్డుపై కుక్కలు దాడిచేయడం గుర్తించారు.
నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన.. ప్రభుత్వం జీవో జారీ
గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. నిన్నటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో అధికారులు ఇవాళ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, డీటీ, ఆర్‌ఐ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ఉన్నతాధికారులు నియమించారు. నిన్న సాయంత్రం సర్పంచ్‌ల వద్ద ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతర రికార్డులన్నీ సీజ్ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక అధికారి, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. డిజిటల్ కీకి అధీకృత అధికారిగా ప్రత్యేక అధికారి ఉంటారు.
నేడు ఝార్ఖండ్ సీఎంగా చంపయీ సోరెన్ ప్రమాణస్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష!
నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపయీకి ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తన వాదనను ఆమోదించాలని చంపయీ గవర్నర్‌ను కోరిన కొన్ని గంటల తర్వాత ఈ ఆహ్వానం వచ్చింది. ఇక వచ్చే 10 రోజుల్లో జరగనున్న ఫ్లోర్ టెస్ట్‌లో చంపయీ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో.. సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపయీ సోరెన్‌ని ఎన్నుకుంది. చంపయీ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ను గురువారం కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కొన్ని గంటల అనంతరం గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. తమ కూటమి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు జేఎంఎం సిద్దమైంది. ఓవైపు గవర్నర్ నిర్ణయం ఆలస్యమవుతుండడం, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షిస్తుందనే అనుమానాల నేపథ్యంలో.. జేఎంఎం, ఆర్జేడీ, కాంగెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు జేఎంఎం ఏర్పాట్లు చేసింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణం వాయిదా పడింది. నేడు వారు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.
భారీగా వీసా ఫీజులు పెంచిన అమెరికా..
అగ్రరాజ్యం అమెరికా సర్కార్ హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 సహా ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజా పెంపుతో భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్-1 బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెంచారు. అయితే, హెచ్–1బీ వీసా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. అలాగే, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల ఉండగా దాన్ని 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం నాడు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016 తర్వాత తొలి సారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.
పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత ఐదు రోజులలో పసిడి ధరలు నాలుగుసార్లు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,440 గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్ల బంగారంపై రూ.170 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,150గా.. 24 క్యారెట్ల ధర రూ.63,440గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,800 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.64,150గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,440గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,270గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150.. 24 క్యారెట్ల ధర రూ.63,440గా ఉంది. నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 2) కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.76,300లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,300గా ఉంది. ముంబైలో రూ.76,300 ఉండగా.. చెన్నైలో రూ.77,800గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,800లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉంది.
నేడు ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భారత్ బోణీ కొట్టేనా?
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ మరో టెస్టుకు సిద్ధమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓటమితో ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్.. అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించాలని చూస్తోంది. బజ్‌బాల్ ఆటతో సిరీస్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్.. ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మరోసారి రసవత్తర పోరు సాగే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుండగా.. 9 గంటలకు టాస్ పడుతుంది. రెండో టెస్టులో గెలవాలంటే భారత బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో రాణించిన రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్ లేకపోవడం దెబ్బే. తుది జట్టులోకి వచ్చేందుకు రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య గట్టిపోటీ ఉంది. ఈ ఇద్దరు నెట్స్‌లో చెమటోడ్చారు. వీళ్లలో ఒకరు టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం. విరాట్ స్థానంలో తొలి టెస్టుకు ముందే జట్టులోకి వచ్చిన రజత్‌కే అవకాశం దక్కేలా ఉంది. జడేజా స్థానంలో కుల్దీప్, సుందర్ రేసులో ఉన్నారు. స్పెషలిస్టు స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్‌నే ఆడించొచ్చు. ఆలా కాకుండా బ్యాటింగ్ పటిష్టం కావాలంటే సుందర్‌ను తీసుకోవచ్చు. ఈ టెస్టులో భారత్ ఒకే పేసర్‌ను ఆడించాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. శుభ్‌మన్, శ్రేయస్‌ఎం భరత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఫేవరేట్ మైదానంలో కెప్టెన్ రోహిత్ చెలరేగాలి అభిమానులు కోరుకుంటున్నారు.
అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?
సుహాస్ శివాని హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ తో పాటు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించారు. నిజానికి ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెరిగింది. దానికి తోడు సినిమా నుంచి రిలీజ్ అయిన దాదాపు అన్ని పాటలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతకు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత సినిమా బావుందని అందరి నోట వినిపిస్తోంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సుహాస్ నటనని, అతని అక్కగా నటించిన పద్మ పాత్రతో శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాకి హీరోగా సుహాసిని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే చివరిలో మాత్రమే ఈ సినిమాలో శరణ్య ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉంటుందని చెప్పారు. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా నటించింది. ఆమెలో ఇంత మంచి నటి దాగుందనే విషయం ఇప్పటివరకు మరుగున పడి ఉండటం బాధాకరం. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రతో ప్రేక్షకులందరికీ పరిచయమైన ఆమె భామాకలాపం లాంటి సినిమాలో కూడా మెరిసింది. కానీ ఈ సినిమాతో ఆమెలో ఉన్న నటిని బయటికి తీసుకురావడంలో సినిమా యూనిట్ సఫలం అయింది కచ్చితంగా ఈ సినిమా తర్వాత మీకు ఇలాంటి మరిన్ని సినిమాలు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దొరుకుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.