నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి ని వారం రోజుల్లో పూర్తి చేస్తాం..
సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్ వద్ద ఎడమ కాలువకు గండి పడింది. దీంతో గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గండి పూడ్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం 2.10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాలువలు చెరువులు పంప్ హౌస్ లను మరమ్మత్తులు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిని వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాత్రి పగలు పనిచేసే గంటని పూడ్చే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. వరద నష్టాన్ని కేంద్రానికి నివేదిక అందించామన్నారు. కేంద్ర సహాయం కోసం వేచి చూడకుండా.. యుద్ధ ప్రాతిపదికను పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్ర సాయం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు..
ఖైరతాబాద్‌లోని బడా గణేష్ దర్మనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు దినంతో పాటు చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నాలుగు వైపుల నుండి లక్షల సంఖ్యలో భక్త జనం వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వినాయక నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ, రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఇవాళ (ఆదివారం) మాత్రమే దర్శనానికి అవకాశం ఉండడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఖైరతాబాద్ కు తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. బడా గణేష్ దర్మనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ట్విట్టర్ లో కేటీఆర్ కామెంట్స్.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారని క్లారిటీ ఇచ్చారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలని సూచించారు. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే ,వారందరినీ గౌరవిస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతామని శ్రీధర్ బాబు అన్నారు.
చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం..
విజయవాడలో వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది.. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.. ఇళ్లను క్లీనింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసింది అని చెప్పారు. నిన్న కొందరు మళ్ళి వరద అంటూ విష ప్రచారం చేశారు.. వైసీపీ కుట్రగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. విష ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేశాం.. ఎవరు విష ప్రచారంకి పాల్పడ్డారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం వరద బాధితులకు మొదటి రోజు నుంచి అండగా నిలబడింది అని మంత్రి నారాయణ అన్నారు.
మెట్రోలో ప్రయాణించిన మేయర్.. సేవలు, సౌకర్యాలపై ఆరా..
మెట్రోలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ప్రయాణించారు. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మేయర్ ప్రయాణించారు. గణేష్ నిమజ్జనం కోసం భక్తులకి స్వాగతం పలుకుతూ పోస్టర్ ఏర్పాటు చేయాలని మెట్రో అధికారులను మేయర్ కోరారు. నిమర్జనం రోజు ఎక్కువ సమయం వరకు మెట్రో రైలు నడపడంతో పాటు వచ్చే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని మేయర్ సూచించారు. మెట్రోలో ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలపై సౌకర్యాలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమైన వారితో మెట్రోలో కాసేపు సరదాగా గడిపారు. పిల్లల మధ్యలో కూర్చొని వారితో ముచ్చటించారు. అనంతరం ప్రజల సూచనలు ఎప్పటికీ అప్పుడు తెలుసుకోవాలని మెట్రో అఫిషియల్ కి మేయర్ గద్వాల విజయ లక్ష్మి సూచించారు.
ద్వారకా తిరుమలలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందికు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది. ఆర్చిగేట్ ముందు షాపు షట్టరు ఢీకొట్టి ఆటో ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
హేమంత్ సొరెన్, కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశీ, రోహింగ్యాలతో జతకట్టింది..
ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ మూడు పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులని ఆరోపించారు. జార్ఖండ్‌ని కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం కోరుకుంటోందని ఆయన అన్నారు. అధికార హేమంత్ సొరెన్ పార్టీ జేఎంఎం ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఆదివాసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు, ఇప్పుడు వారి అటవీ భూమిని ఆక్రమించిన వారితో జతకట్టారని జేఎంఎంపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్, జేఎంఎం ‘‘బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారుల’’తో జతకట్టిందని, వీరంతా ఆ పార్టీలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల దృష్టిసారించిన కాంగ్రెస్ దెయ్యం ఇప్పుడు జేఎంఎంని ఆవహించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసినప్పుడల్లా బుజ్జగింపు మాత్రమే ఎజెండా అవుతుందని, దీని వల్ల మొదటగా బాధపడేది దళితులు, గిరిజనులు, వెనకబడిన సమాజ ప్రయోజనాలే అని అన్నారు. అదే ద్రోహం ఇప్పుడు జేఎంఎం చర్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
ఈ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
భారత వాతావరణ శాఖ ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. గంగా నది పశ్చిమ బెంగాల్‌పై లోతైన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో.. ఈరోజు, రేపు జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్‌లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది. అలాగే.. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలైన.. మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, గుజరాత్‌లలో ఒక వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు, రేపు.. తూర్పు మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 16-18 మధ్య అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే.. తూర్పు మధ్యప్రదేశ్‌లో రేపు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులది..
ఖైరతాబాద్ గణేషుడిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెట్టిన చరిత్రలో మన ఖైరతాబాద్ గణేష్‌ది అని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులదని, ఈ సంస్కృతి నీ రాబోయే తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు. ఆనాడు బాలా గంగాధర్ తిలక్ భారతీయులను ఒక్క తాటిమీదికి తేవడానికి వినాయక చవితి దేశ వ్యాప్తంగా నిర్వహించేలా చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ కలిసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గత 9 ఏళ్లు కేసీఆర్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, అదే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
కాంగ్రెస్‌లో పని చేసిన ఏ ఒక్కరినీ వదిలేయం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. లాంఛనప్రాయ కార్యక్రమంలో, పదవీ విరమణ చేసిన టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసి, పార్టీని నూతనోత్సాహంతో ముందుకు నడిపించాలని కోరారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు మహేశ్ ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్పూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మంది కార్యకర్తలు అవమానాలు భరించి..జెండాను అధికారంలోకి తెచ్చారని, కాంగ్రెస్ నీ గెలిపించింది కార్యకర్తలు.. కార్యకర్తలు తల ఎత్తుకుని పని చేసేలా పని చేస్తున్నామన్నారు. ఒకేసారి 18 వేల కోట్లు రుణమాఫీకి ఇచ్చిన పార్టీ దేశంలో ఎక్కడా లేదని, గాంధీ భవన్ నుండి వచ్చే ఆదేశాలు ప్రభుత్వం పాటిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలది..ప్రజలకే సంపద పంచే పనిలో ఉన్నామని, కాంగ్రెస్ లో పని చేసిన ఏ ఒక్కరినీ వదిలేయమని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వం మనది అని ప్రజలకు చెప్పండన్నారు.