ముగిసిన ఢిల్లీ టూర్.. ఏపీకి సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు సీఎం.. ఈ పర్యటనలో బిజీబిజీగా గడిపారు.. మూడు రోజుల పర్యటనలో నీతి అయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు.. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ విడివిడిగా భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని అమిత్ షాను కోరారు జగన్. దానికి కేంద్ర కేబినెట్ వీలైనంత త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలన్నారు. అలాగే, ఆంధప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి ప్రస్తావించారు జగన్. సమస్య పరిష్కరానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జగన్. ఢిల్లీలోని ఏపీ భవన్ సహా షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల విభజనపైనా అమిత్ షాతో చర్చించారు జగన్. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల ఆర్థిక స్థిగతులను పరిగణలోకి తీసుకుని వెంటనే బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు ఏపీ సీఎం జగన్. మొన్న ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల బలోపేతంతో ఆర్థికవ్యవస్థ మరింత వేగంగా పరుగులెడుతోందన్నారు. ఏపీ సాధించిన ప్రగతిపై నీతిఆయోగ్ సమావేశానికి నోట్ ఇచ్చిన సీఎం జగన్.. భారత్‌లో లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉండడంతో.., భారత్ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. ఏపీ ప్రభుత్వం పోర్ట్ ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం జగన్. ఏపీలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్లుగా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం జగన్.
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? బాలయ్య ఫొటో ఎందుకు పెట్టలేదు..?
ఎన్టీఆర్ వందో జయంతి వేడుకలు, టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని ఆరోపించారు.. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారు? అని నిలదీశారు.. ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారు.. పనికి మాలిన వెధవల్ని తెచ్చుకుని మిమ్మల్ని బండబూతులు తిట్టించటం.. ఇంద్రుడు, చంద్రుడు అని చంద్రబాబును పొగిడించుకోవడం వాళ్ల పనిఅంటూ విమర్శించారు.. అసలు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? అని ప్రశ్నించారు కొడాలి.. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారుగా అని ఫైర్ అయ్యారు. లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారక్ ఫొటో ఎందుకు పెట్టలేదు? ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా? అని ప్రశ్నించారు కొడాలి నాని.. 2004, 2009లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటి చూపించినా వైసీపీని మూవేస్తామన్న ఆయన.. 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడని విమర్శించారు.. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు. .చేశాడా? ఆరోగ్య శ్రీ సంకనాకించేశాడు.. 2014లో రెండు వేల నిరుద్యోగ భృతి అన్నాడు.. 2019 ఫిబ్రవరిలో కొంత మందికి ఇచ్చాడు? పెన్షన్ పెంచుతాని 2019 వరకు పట్టించుకోలేదు.. 30 లక్షల మందికి చంద్రబాబు ఇస్తే.. జగన్ 60 లక్షల మందికి ఇస్తున్నారు అని పేర్కొన్నారు.. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తాను అన్నాడు.. ఒక్క విద్యార్ధికి ఒక్క ల్యాప్ టాప్ అయినా ఇచ్చాడా? ఇన్నాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నాడు అంటూ మండిపడ్డారు. మహానాడు అంటే ఇదా? స్క్రాప్ వెధవలతో వేదిక పై వాగించటమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
పత్తికొండలో దారుణం.. భర్తను సజీవదహనం చేసిన భార్య..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదు.. కట్టుకున్న భార్యకు భారంగా మారిపోయాడో వృద్ధుడు.. అయితే, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతోన్న ఆ వృద్ధుడిని చూసుకుంటూ వచ్చిన భార్య.. కొడుకులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందింది.. చివరకు భర్తను ఇంట్లోనే సజీవంగా దహనం చేసింది.. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. కట్టుకున్న భార్య ఈ ఘాతుకానికి పాల్పడినా.. కన్న కొడుకుల ప్రవర్తనే ఈ దారుణానికి కారణం అంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ఆ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భర్త హరికృష్ణ(60)కు వృద్ధాప్యంలో సేవ చేయలేక.. అతడు బతికుండగానే నిప్పుపెట్టింది దహనం చేసింది భార్య లలిత.. కొన్నేళ్లుగా అనారోగ్యంతో మంచం పట్టాడు భర్త.. కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణను ఏళ్లుగా చూసుకుంటుంది.. కానీ, ఇద్దరు కుమారులు వారిని పట్టించుకున్న పాపాన పోయినట్టుగా లేరు.. ఒక కొడుకు కెనడాలో ఉండగా.. మరో కొడుకు స్థానికంగా మెడికల్ షాప్‌ను నిర్వహిస్తున్నారు.. కొడుకులు పట్టించుకోక, తాను కూడా చూడలేని పరిస్థితి నెలకొనడంతో.. ఇంట్లోనే భర్తపై అట్టముక్కలు వేసి నిప్పుపెట్టింది ఆ భార్య.. దీంతో, ఆ వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.. ఆ తర్వాత తానే.. తన భర్తను ఇలా కాల్చివేశానని చెబుతోంది భార్య లలిత.
దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా?
జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజర్ల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ ప్రజలు రెజర్లను ఆదుకోవాలి. వారిని మనమందరం గౌరవించాలని కేటీఆర్ కోరారు. రెజర్లను ఢిల్లీ పోలీసులు లాగుతూ వుంటే మరో వ్యక్తి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెజర్లకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ ప్రశ్నించారు. దేశ ఖ్యాతిని చాటిన రేజర్లపై అంత కర్కసం చూపించడం ఏంటని మండిపడ్డారు. రెజర్లకు మద్దతు తెలిపారు. రెజర్లపై నిన్న ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట చేస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక బలగాలు కఠినంగా వ్యవహరించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనంలో ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా మరియు ఇతర నిరసనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. రెజ్లర్లపై కేసులు నమోదు చేశారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని వినేష్ ఫోగట్ ఆక్షేపించారు.
ప్రయోగం విజయవంతం.. దీని వల్ల ఉపయోగం ఏంటి..?
అంతరిక్షంలో సత్తా చాటుతోన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO).. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఈ రోజు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నావిగేషన్ శాటిలైట్ (navigation satellite) ను ప్రయోగించి విజయం సాధించింది.. ఎన్‌వీఎస్-01 ఉపగ్రహంతో ఉదయం 10:42 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 వాహనకౌక.. నిర్ధిష్టమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. ఇక, ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.. నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిపోగా.. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతోంది ఇస్రో.. ఇక, జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఈ ప్రయోగంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్. నావిక్ అంటే ఏమిటి? అనే విషయానికి వస్తే.. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) అనేది ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇది కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం, ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేస్తుంది. నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు మరియు వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను అందిస్తుంది, అవి సాయుధ దళాలు. మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ మరియు టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. నెట్‌వర్క్ భారతదేశంతో సహా ఒక ప్రాంతాన్ని మరియు భారత సరిహద్దును దాటి 1500 కిలోమీటర్ల వరకు పనిచేస్తోంది. ఇది భూసంబంధమైన, వైమానిక మరియు సముద్ర రవాణా, స్థాన-ఆధారిత సేవలు, వ్యక్తిగత చలనశీలత, వనరుల పర్యవేక్షణ, సర్వేయింగ్ మరియు జియోడెసీ, శాస్త్రీయ పరిశోధన, సమయ వ్యాప్తి మరియు సమకాలీకరణ మరియు భద్రత-ఆఫ్-లైఫ్ హెచ్చరిక వ్యాప్తిలో ఉపయోగించబడుతుంది.
ఇప్పుడు జనాభా లెక్కింపు డౌటే..! ఆ తర్వాతేనా..?
రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కింపు ఈ ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు. జనాభా లెక్కలు సేకరించే సమయంలోనే సార్వత్రిక ఎన్నికల పనుల కోసం సిబ్బందిని ఉపయోగించే అవకాశం ఉన్నందున .. ఈ ఏడాది కూడా జనాభా లెక్కలు తీసే అవకాశం లేదని అధికారులు సైతం చెబుతున్నారు. ప్రతి 10 ఏళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు జరగాల్సి ఉంటుంది. అలాగే 2011 తరువాత 2021కి సంబంధించిన సెన్సస్‌ను చేపట్టాలి. వాస్తవంగా జనాభా లెక్కలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సేకరిస్తారు. 2021కి సంబంధించిన జనగణన (సెన్సస్) 2020లో జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే 2020లో వాయిదా పడిన జనగణను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ వచ్చే ఏప్రిల్–మే మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నందున .. జనగణను చేపట్టే అవకాశం లేనట్టుగా కనపడుతోంది. ఇదే అంశాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వవర్గాలు సైతం వెల్లడించాయి. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాతనే కొత్తగా జనాభా లెక్కలు చేపట్టే అవకాశం ఉంది.
అసోం, అండమాన్ దీవుల్లో భూప్రకంపనలు..
అసోంతోపాటు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం స్వల్పంగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే దీనివల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో సైతం ఉదయం 7.48 గంటలకు భూమి కంపించిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.8గా నమోదయిందని తెలిపింది. డిగ్లిపూర్‌కు సుమారు 137 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూమి పొరల్లో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఆదివారం కొన్ని దేశాల్లోనూ భూకంపం సంభవించింది. అప్ఘానిస్థాన్ లోని ఫైజాబాద్ లో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. పాకిస్థాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలు, భారతదేశంలోని శ్రీనగర్, పూంచ్, జమ్మూ, ఢిల్లీ ప్రాంతాల్లోనూ భూప్రకంపనలతో సీలింగ్ ఫ్యాన్లు షేక్ అయినట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం.. రేపు ఏచూరితో కేజ్రీవాల్ భేటీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు (మంగళవారం) మధ్నాహ్నం సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేక పోరాటంలో మద్ధతివ్వాలని కోరనున్నారు. కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేక పోరాటంలో భాగంగా కేజ్రీవాల్ ఇప్పటికే ఆదివారం తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి పోరాటంపై చర్చించారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో.. కేజ్రీవాల్ మంగళవారం సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ కానున్నారు. కలసివచ్చే ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్డినెన్స్ పై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, కోల్‌కతా వెళ్లిన ఆయన.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కావడం.. ఆమె మద్దతు కూడా కోరిన విషయం విదితమే.. గత వారం రోజులుగా బీహార్ సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కె. చంద్రశేఖర్ రావులతో సమావేశమయ్యారు. ఎన్డీయేతర శక్తులను కూడగట్టి.. కేంద్రం ఆర్డినెన్స్‌పై పోరాటం ఉధృతం చేయాలని భావిస్తోన్న అరవింద్ కేజ్రీవాల్.. అందులో భాగంగా.. బీజేపీయేతర సీఎంలను, విపక్ష నేతలను కలుస్తూ వస్తున్నారు.
జపాన్ పర్యటనలో సీఎం స్టాలిన్.. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణం
జపాన్ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుల్లెట్ ట్రయిన్‌లో ప్రయాణించారు. ఏకంగా 500 కిలోమీటర్లు బుల్లెట్ ట్రయిన్‌లో ప్రయాణించారు. విదేశీ పెట్టుబడుల కోసం స్టాలిన్ జపాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జపాన్ పర్యటనలో భాగంగా ఆదివారం బుల్లెట్ ట్రయిన్ ఎక్కారు. ఓసాకా నగరం నుంచి జపాన్ రాజధాని టోక్యో వరకు బుల్లెట్ రైల్‌లోనే ప్రయాణించారు. బుల్లెట్ రైల్‌లోని ఫోటోలను సీఎం స్టాలిన్ తను స్వయంగా ట్వీట్టర్‌లో షేర్ చేశారు. వేగవంతమైన ఇలాంటి బుల్లెట్ రైల్ సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒసాకా నుంచి టోక్యో వరకు బుల్లెట్ రైల్‌లో ప్రయాణం చేశానని.. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కిలోమీటర్ల ప్రయాణం సాగిందని స్టాలిన్ ట్వీట్టర్‌లో పేర్ చేశారు. తమిళనాడు రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం సీఎం ఎంకే స్టాలిన్ సింగపూర్; జపాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టోక్యోలో బుల్లెట్ ట్రయిన్‌లో ప్రయాణించిన అనంతరం దాని గురించి మాట్లాడుతూ డిజైన్‌లోనే కాకుండా వేగం, నాణ్యతలోనూ బుల్లెట్ రైల్‌కు సమానమైన రైల్వే సేవలు ఇండియాలోనూ రావాలన్నారు. తద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షిస్తూ ఫ్యూచర్‌ఇండియా అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అలాగే జపాన్‌లో ఉన్న తమిళులతో సీఎం స్టాలిన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమిళుల సంస్కతిని చాటి చెప్పేలా అక్కడి చిన్నారులు నిర్వహిం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయన్నారు.
తొలగిన అడ్డంకులు.. అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్ష్యులు రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించనున్నారు. సోమవారం నుంచి జూన్ 4 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన అనంతరం రాహుల్ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్ట్‌ను అధికారులకు ఇచ్చేశారు. తరువాత కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాహుల్‌కు సాధారణ పాస్‌పోర్టు జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని శనివారం ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది. కోర్టు తీర్పు అనంతరం అధికారులు రాహుల్ గాంధీకి ఆదివారం సాధారణ పాస్‌పోర్టును పంపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ అమెరికా పర్యటనకు మార్గం సుగమం అయింది. మొత్తంగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు అడ్డంకులు తొలగిపోయాయి. సాధారణ పాస్‌పోర్టుతో అమెరికా బయలుదేరుతున్నారాయన. ఈ నెల 31 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు రాహుల్. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు భారత సంతతి పౌరులతో సమావేశమవుతారు. వాషింగ్టన్ డీసీలో చట్టసభ సభ్యులు, మేధావులతో భేటీ కానున్నారు రాహుల్. జూన్ 4న న్యూయార్క్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జావిట్స్ సెంటర్‌లో విభిన్న రంగాలకు చెందిన వారితో ముఖాముఖిలో పాల్గొంటారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఈ పాటతో ఏడిపించేలా ఉన్నాడు భయ్యా…
శ్రీ రాముడు, జానకి కథలో భరించలేని బాధ ఉంటుంది. ముఖ్యంగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బందించినప్పుడు… రాముడు సీత కోసం వెతికే ప్రయాణంలో ఉండే బాధ ఎన్ని రామాయణాలు రాసినా వర్ణించడం కష్టమేమో. మహారాణిగా కోటలో ఉండాల్సిన సీత, లంకలో అశోకవనంలో రాముడి కోసం ఎంత ఎదురు చూసిందో వాల్మీకీ రామాయణం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కూడా సీతా రాముల మానసిక వ్యధని తెరపై చూపించబోతున్నాడు. ఆదిపురుష్ సినిమాలో ‘రామ్ సీతా రామ్’ పాటతో ఆడియన్స్ ని కంట తడి పెట్టించబోతున్నాడు. జూన్ 16న థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఓం రౌత్ ‘రామ్ సీత రామ్’ పాటతో ఏడిపించడం గ్యారెంటీగా జరిగేలా ఉంది. ఈ పాట లిరికల్ వీడియో బయటకి వచ్చి, సెన్సేషనల్ వ్యూస్ తో పాటు అందరి నుంచి హార్ట్ టచింగ్ కాంప్లిమెంట్స్ అందుకుంటూ ఉంది. రాముడు సీతాదేవి మధ్య ఉన్న అనుబంధాన్ని రెండు డైలాగ్స్ తో చెప్పే ప్రయత్నం కూడా ఈ పాటలో జరిగింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని ఇకపై శ్రీరామ నవమి పండగ ఎప్పుడు జరిగినా ఇదే పాట వినిపించే అంత గొప్పగా రాసాడు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. రోజు రోజుకి అంచనాలు పెంచుతూ పోతున్న ఆదిపురుష్ టీమ్, జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఈ ఈవెంట్ తో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ. వంద్ కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో పాటు ఓవరాల్ రన్ లో ప్రభాస్ కి మరో వెయ్యి కోట్ల సినిమాగా ఆదిపురుష్ కనిపిస్తోంది.
ఇది తెలుగు సినిమా అభిమానులు అంటే…
గతంలో ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తీసిన ఒక భారీ బడ్జట్ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. పేరుకి, ప్రమోషన్స్ కి పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ సినిమా మొత్తం తమిళ నేటివిటీ ఉంది అనే కామెంట్స్ ఆ భారీ బడ్జట్ సినిమాపై గట్టిగానే వినిపించాయి. అర్ధం కాకపోవడం, నేటివిటీ ఇష్యూస్, లాగ్ లాంటి పలు కారణాల వలన ఆ పాన్ ఇండియా సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో తమిళ క్రిటిక్స్ కొంతమంది, మరికొంతమంది తమిళ సినీ అభిమానులు కూడా తెలుగు సినీ అభిమానులపై, తెలుగు క్రిటిక్స్ పై నెగటివ్ కామెంట్స్ చేసారు. మీ సినిమాలు కోలీవుడ్ లో ఎలా హిట్ అవుతాయో చూస్తాం అనే వరకూ ఆ విమర్శలు వెళ్లాయి. ఆ సమయంలో కొంతమంది బయటకి వచ్చి తమిళ సినిమాలు తమిళ్ లో కన్నా తెలుగులో హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని గుర్తు చేసారు. ఈ విషయాన్నే మరోసారి నిరూపిస్తోంది 2018 సినిమా. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ మూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. 160 కోట్లకి పైగా రాబట్టి కేరళ బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ మూవీని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేసాడు. ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయని 2018 మూవీ కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. అసలు ఇక్కడి కథ కాదు, ఇక్కడ తెలిసిన ఆర్టిస్టులు కాదు భారీగా ప్రమోట్ చేసిన సినిమా కూడా కాదు. ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నా కూడా సినిమా బాగుండడంతో 2018 మూవీకి తెలుగు సినీ అభిమానులు హిట్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా ఇస్తున్నారు. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది అంటే 2018 మూవీని మన ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరో వారం పాటు పెద్దగా ఇంపాక్ట్ చూపించే సినిమాలు విడుదల కావట్లేదు కాబట్టి దాదాపు 2018 సినిమా హవానే కొనసాగుతుంది. ఇలా మంచి సినిమాలు తీస్తే తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తారు అని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేసారు.