అజ్ఞాతంలో మంత్రి గుమ్మనూరు జయరాం.. విషయం అదేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు, చేర్పులు.. కొన్ని ప్రాంతాల్లో వివాదాలకు దారి తీశాయి.. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో.. తాజా అభ్యర్థులకు సరైన సహకారం ఉన్నట్టుగా కనిపించడంలేదు.. మరికొన్ని చోట్ల మాత్రం కొత్త ఉత్సాహంతో నేతలు దూసుకుపోతున్నారు. అయితే, ఇదే సమయంలో.. వైసీపీ సీనియర్ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా.. ఆయన అందుబాటులోకి రావడం లేదట.. అసలు మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వొచ్చు కదా? అంటున్నారట వైసీపీ పెద్దలు. అయితే, ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం.. ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన తర్వాత 4 రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరులో మూడు రోజులు గడిపారు. ఇదే సమయంలో ఆలూరు వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదట. ఇక, నిన్న ఆలూరు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట మంత్రి జయరాం.. ఎంపీగా పోటీ చేసే విషయంపై మాట్లాడేందుకు వైసీపీ ముఖ్య నేతల ప్రయత్నం చేసినా ఆయన దొరకడం లేదట.. అయితే, ఆలూరు స్థానాన్ని వదులుకోవడానికి మంత్రి జయరాం సుముఖంగా లేరని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే స్థానం నుంచి కాకుండా.. ఈ సారి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ఆయనకు ఇష్టం లేదనే ప్రచారం సాగుతోంది.. అందుకే ఆయన ఎవరీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది.
పుట్టిన రోజు వేడుకల తర్వాత సైలెంట్ అయిన వైసీపీ ఎమ్మెల్యే..
వైసీపీలో ఇంఛార్జిల మార్పు వ్యవహారంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు మొదట్లో కొంత హల్‌చల్ చేసి.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు.. పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఆయన.. అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో దొరబాబు బలప్రదర్శనకు ఈ కార్యక్రమం వేదికైందనే చర్చ సాగింది.. పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలి.. నియోజకవర్గంపై నాకే ఎక్కువ పట్టుంది.. అందుకే వేలాది మంది నా పుట్టిన రోజు వేడుకలకు తరలివచ్చారని.. పిఠాపురం టికెట్ మళ్లీ నాకే ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.. అయితే, ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలుకు దూరంగా ఉంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన దొరబాబు.. అప్పటి నుంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆ తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.. అయితే, మరోసారి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఆ దిశగా ప్రత్యామ్నాయ ఆప్షన్స్ పై దృష్టి పెట్టారా? అనే చర్చ సాగుతోంది.. అది నిజమే అని తెలుస్తోంది.. ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారట దొరబాబు.. అనుచరుల సూచనల మేరకు పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కోఆర్డినేటర్ గా వంగా గీతను నియమించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.
రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య..? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్యామలాదేవి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం మరోసారి ఎన్నికల బరిలో దిగుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కృష్ణం రాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు జయవంతి వేడుకల్లో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కృష్ణంరాజు జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రజల అభీష్టం మేరకే తమ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటున్నారు శ్యామల కృష్ణంరాజు.. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు విద్య, వైద్య పరంగా ఏ కష్టం వచ్చినా మేం అండగా నిలబడతామని ప్రకటించారు. ఇక, కృష్ణం రాజు ఫ్యామిలీ మరోసారి రాజకీయాల్లో రావడం.. పోటీ చేయడం ఖాయమనే చర్చ సాగుతోంది.. గతంలో.. రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించిన కృష్ణం రాజు.. కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు.. ఇక, ఆయన కన్నుమూసిన తర్వాత.. మొగల్తూరులో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. ఆ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాలకు దగ్గర అవుతుందనే ప్రచారం సాగుతోంది.. అయితే, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు..? అనేది దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రత్యేక కార్గో ఛాపర్‌లో అయోధ్యకు చేరుకున్న శ్రీవారి లడ్డూలు..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది.. అయితే, ఇప్పుడు అయోధ్యకు చేరుకున్నాయి శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు.. దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. అయోధ్యకు పంపించడానికి ప్రత్యేకంగా లక్ష లడ్డూలను తయారు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు ఉదయం తిరుమల నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తరలించింది.. ఇక, తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలించారు. కాగా, అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకుంది.. దాని అనుగుణంగా లడ్డూలను తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించారు.. ఈ రోజు తిరుపతి విమానాశ్రయాని నుండి ఉదయం ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు చేర్చారు టీటీడీ అధికారులు.. అక్కడ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులకు అందజేయనున్నారు.
టీడీపీలోకి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి..! బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్ ఇవ్వకుండా.. ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం.. ఈ పరిణామాలతో టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన పార్థసారథి.. త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఇప్పటికే పెనమలూరు స్థానాన్ని ఆశిస్తున్న టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీలోకి వస్తున్న పార్థసారథి.. పెనమలూరు నుంచి టీడీపీ టికెట్ ఆశించటం అనేది ఆయన ఛాయిస్ అన్నారు. అయితే, టికెట్ పై ఫైనల్ నిర్ణయం తీసుకునేది మా పార్టీ అధినేత చంద్రబాబే అన్నారు. సారథికి అధిష్టానం టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే ఆయనకి నేను సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటానని హాట్ కామెంట్లు చేశారు. అయితే, ఐదేళ్ల నుంచి పార్టీ కోసం పెనమలూరులో కష్ట పడ్డాను అని గుర్తుచేసుకున్నారు బోడే ప్రసాద్.. మాకు న్యాయం చేస్తారని చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉంది.. గత ఐదేళ్ల హయాంలో మా వాళ్లు కూడా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం.. ఐదేళ్ల పాటు కేసులు పెట్టించుకున్న మా కార్యకర్తలు.. ఇప్పుడు వారి నాయకత్వంలో పనిచేయటం ఇష్టం లేకే ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం.. చంద్రబాబును టీడీపీని తిట్టిన వారు పుట్ట గతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇక, పార్థసారథిపై ఇప్పుడే నేనేం మాట్లాడబోను అంటూ దాటవేశారు టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ .
హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు..
హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎల్లుండి రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో ఏర్పాట్లకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎల్లుండి రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో బిగ్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షoగా చూసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. అయోధ్యలో భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవం 22 న జరుగుతోందన్నారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజన్నారు. ప్రపంచం మొత్తం శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందన్నారు. బాబర్ దురాక్రమణలో అయోధ్య ద్వంసం అయ్యిందన్నారు. 1885 నుంచి రామా మందిరంపై కోర్టులో కేసు నడుస్తూ వచ్చిందన్నారు.
లండన్ పర్యటలో రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన యువతి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నిన్నటితో ముగిసింది. అయితే ఇప్పుడు లండన్ లో పర్యటిస్తున్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 15 నుంచి 19 వరకు దావోస్‌లో పర్యటించిన రేవంత్ తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు.. లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. అయితే రేవంత్ లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం రేవంత్ స్టేజ్ పై మాట్లాడుతున్న క్రమంలో ఓ యువతి ఆయనకు ప్లవర్ బోకే చేతికి ఇచ్చింది. అంతేకాకుండా రేవంత్ కు అందరిముందు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. సీఎం కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరుతూ చేయిచాచింది. అయితే సీఎం రేవంత్ ఆ యువతి హుత్సాహం చూసి మురిసిపోయారు. ఆ యువతికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆ యువతి ఉత్సాహం మరింత పెరిగింది. సీఎం రేవంత్ సార్ అంటూ స్టేజ్ ముందు ఎగురుతూనే వుంది. ఆ యువతి సీఎం రేవంత్ రెడ్డిపై చూపిన అభినాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంతమంది ఉన్నా కూడా రేవంత్ పై ఆ యువతి అభిమాన్ని చూపుతూ ప్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియోను కెమెరా క్యాచ్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా ఈ వీడియో చూసిన వాళ్లందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ అన్నా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో కాదు రేవంత్ అన్నకు ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు ఉంటారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
రెండో రోజు తమిళనాడులో ప్రధాని పర్యటన.. శ్రీరంగం, రామేశ్వరంకు మోడీ..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం నాడు వెళ్లారు. కాగా, నేడు తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆయలంలో ఆయన పూజలు చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని రామేశ్వరం చేరుకోనున్నారు. అక్కడ కూడా ఆయన ప్రత్యేక పూజలో పాల్గొంటారు. శ్రీరంగం స్కాలర్స్ పాడనున్న కంబ రామాయణం భజనలను ఆలకించనున్నారు. ఇక, ఇవాళ మధ్యాహ్నం రామేశ్వరం చేరుకోనున్న ప్రధాని.. స్వామివారి దర్శనం, అభిషేక పూజలో పాల్గొంటారు. శ్రీరంగం, రామేశ్వరం ఆలయాలకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీరంగ ఆలయాన్ని భూలోక వైకుంఠంగా భక్తులు భావిస్తారు. అయితే, జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీ రామ మందిరంను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పలు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు.
గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలవుతున్నారా.. అలా వెళ్లి మార్కెట్లో ఏఐ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకోండి
టెక్నాలజీ వినియోగం నిత్యం పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోంది. ఈ ఏఐతో పనిచేసే చాట్‌జీపీటీ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. దీంతో ఉద్యోగాలు పోతాయని చాలా వరకు భయపడ్డా.. ఇప్పుడు చాలా కంపెనీలు తమ పనిలో ఈ ఏఐని ఒక భాగంగా వాడుకుంటున్నాయి. ఆయా ఉద్యోగులకు కృత్రిమ మేధపై ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లు కూడా వచ్చేశారు. ఇక ఈ కొత్త కొత్త సాంకేతికతల్ని చూసి భయపడాలో.. అందివస్తున్న అవకాశాలు చూసి ఆనందపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కొత్త కొత్త అవకాశాలను అందించేందుకు ఏఐ సిద్ధమవుతోంది. వయసు మీద పడుతున్నా.. పెళ్లికాని ప్రసాదులకు, గర్ల్‌ఫ్రెండ్ లేదని బాధపడే యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక సొల్యూషన్ చూపించనుంది. అసలు అలాంటిది సాధ్యపడనుందా ?
వీడియో చూసినందుకు 12ఏళ్ల జైలు శిక్ష
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కొంత కాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. కొన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రాలేదు. ఈ వార్త చదివితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని దక్షిణ కొరియా వీడియోలను చూశారన్న కారణంతో ఉత్తర కొరియా అధికారులు ఇద్దరు యువకులకు 12 సంవత్సరాల శ్రమ, జైలు శిక్ష విధించారు. ఇద్దరు యువకులను బహిరంగంగా శిక్షించిన వీడియో ఫుటేజ్ బయటపడింది. ఆ వీడియోలను చూసి అబ్బాయిలు చాలా గోప్యమైన సమాచారాన్ని తెలుసుకున్నారని కాదు, ఇంత కఠినమైన శిక్ష విధించిన వీడియోలు దక్షిణ కొరియా సినిమాలు, సంగీతానికి సంబంధించినవి. బయటకు వచ్చిన వీడియో ఉత్తర కొరియాలోని పెద్ద నగరం ప్యోంగ్యాంగ్‌కు చెందినదని చెబుతున్నారు. ఈ వీడియోలో దోషులుగా తేలిన తర్వాత శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు అబ్బాయిల వయసు దాదాపు 16 ఏళ్లు. ఈ వీడియో కోవిడ్ కాలం నాటిది కావచ్చు, ఎందుకంటే చాలా మంది మాస్క్‌లు ధరించి కనిపిస్తారు.
ఫిబ్రవరి 8న పాకిస్థాన్ లో ఎన్నికలు.. తాత్కాలిక ప్రధాని కీలక నిర్ణయం
పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కకర్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్లు, రైల్వేలు, సముద్ర వ్యవహారాల తాత్కాలిక మంత్రి షాహిద్ అష్రఫ్ తరార్‌ను కమిటీకి అధిపతిగా నియమించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, కమిటీలోని ఇతర సభ్యులలో హోం సెక్రటరీ, నలుగురు ప్రావిన్షియల్ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు పరిపాలనా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను సమీక్షించి పరిష్కరించడం.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఈ కమిటీ నిర్వహించాల్సి ఉంటుంది. దేశంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత తాత్కాలిక ప్రధాని కాకర్‌పై ఉంది. అయితే అతను సైనిక-మద్దతుగల రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాడని పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఎన్నికలకు ముందు కూడా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ‘పూర్వ ఎన్నికల రిగ్గింగ్’ కారణంగా దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశించడం లేదని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది. పాకిస్తాన్ ప్రజల మానసిక స్థితి ఏమిటి? అనేది ఎవరికి తెలియదు అని చెప్పుకొచ్చింది.
సానియాతో విడాకులు..హీరోయిన్ ను మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ళు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గతేడాది ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు సానియా పోస్ట్ లు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తల పట్ల ఇంత వరకూ ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలా మంది ఇరువురూ విడాకులు తీసుకున్నారని కన్ ఫాం అయ్యారు. అయితే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకింత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్.. అది మా వ్యక్తిగత విషయం అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమని మీడియాకు సూచించాడు.
ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?
సలార్ రిలీజ్ అయినప్పటి నుంచి… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే చర్చ జరుగుతునే ఉంది. వాస్తవానికైతే… ఈ సమ్మర్‌లోనే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ సలార్ పార్ట్ 1 హిట్ అవడంతో పాటు… ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే… సలార్ సెకండ్ పార్ట్‌ని మొదలు పెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సలార్ 2 షూటింగ్ కొంత భాగం కంప్లీట్ అయిందని అంటున్నారు. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా శౌర్యంగపర్వం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే… స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేలోపు సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్ పార్క్’ను ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు ఎలాగు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే… దేవర రిజల్ట్‌ను బట్టి దేవర 2 ఉంటుంది. అయినా కూడా కొరటాలకు స్క్రిప్ట్ కోసం కొంత సమయం కావాలి కాబట్టి… ఎన్టీఆర్ 31 కంప్లీట్ అయ్యేలోపు కొరటాల ఆ పనిలో ఉంటాడు. సో ఎలా చూసుకున్నా… ముందుగా సలార్ శౌర్యంగ పర్వం తెరకెక్కే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే సలార్ 2 అనౌన్స్మెంట్ బయటికి రానుంది. ప్రభాస్ కూడా కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్‌లతో పాటు సలార్2 ఫినిష్ చేసి… ఫ్రెష్‌గా స్పిరిట్ స్టార్ట్ చేయాలనకుంటున్నాడు. ఆ తర్వాత హనురాఘవపూడితో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీ చేయనున్నాడు కాబట్టి… 2025లో సలార్ 2 థియేటర్లోకి రావడం పక్కా. మరి శౌర్యాంగ పర్వం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
దేవర… దీంతో కంప్లీట్ అవుతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సముద్ర వీరుడిగా చూపిస్తు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కసితో పని చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ చూస్తే కొరటాల ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. గ్లింప్స్‌తో దేవర ప్రమోషన్స్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిన మేకర్స్… ఇదే స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి… అనుకున్న సమయానికి ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే దేవర సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్‌గా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంగ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా వేసినట్టుగా సమాచారం. మరో రెండు వారాల పాటు అక్కడే దేవర షూటింగ్ జరగనుందని అంటున్నారు. అయితే… ఈ లాంగ్ షెడ్యూల్‌తో దేవర షూటింగ్ కంప్లీట్ అవుతుందా? లేదంటే, మరో షెడ్యూల్ ఏమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మరో 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి… నెక్స్ట్ షెడ్యూల్‌తో దేవరకు ప్యాకప్ చెప్పేయడం గ్యారెంటీ. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టనున్నాడు కొరటాల. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా… సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ డిలే కారణంగానే సాంగ్స్ షూటింగ్ లేట్ అవుతుంది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి దేవరకి ఎప్పుడు గుమ్మడికాయ కొడతారు? దేవర న్యూ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే… ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!