Union Cabinet Meet: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సహాయ మంత్రులను కూడా ఆహ్వానించారు. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రచారం జరుగుతుండడం, ఆదివారం మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కేబినెట్‌లో పలువురికి చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ జాతీయ కార్యదర్శి ప్రఫుల్ పటేల్‌కు మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు-చేర్పులు జరిగిన పక్షంలో మిత్రపక్షాలతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నేతలకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది.
Also Read: NCP: అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.. ముగ్గురిని తొలగించిన ఎన్సీపీ
ఈ కేబినెట్ సమావేశంలో.. పార్లమెంట్ వర్షకాల సమావేశాల గురించి చర్చించే అవకాశం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే తన అమెరికా పర్యటన విజయవంతం కావడంపై ప్రధాని మోడీ ఈ సమావేశంలో తన ఆలోచనలను పంచుకోనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్‌కు ప్రఫుల్ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రఫుల్‌ను కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా కేంద్ర మంత్రి పదవి వరించనున్నట్లు సమాచారం. మిత్ర పక్షాలకూ కేబినెట్‌లో సరైన స్థానం కల్పించేలా మోడీ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులలో మార్పులు చోటుచేసుకోనున్నాయని, త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయాలు వెలువడుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు