PM Modi: తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈరోజు (ఏప్రిల్ 6న) శ్రీ రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 గంటలకు పంబన్ బ్రిడ్జిను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న మోడీ.. అనంతరం బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తైన పనులను ప్రారంభించనున్నారు. అలాగే, సభ ముగిసిన తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల దగ్గర పూజలు చేయనున్నారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు.
Read Also: MS Dhoni Retirement: చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు.. రిటైర్మెంట్‌పై ఊహాగానాలు!
అయితే, రామేశ్వరం- తాంబరం మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సుమారు 535 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రైల్వే బ్రిడ్జి మధ్య భాగంలో వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఓడలు, పడవలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆ సమయంలో ఈ బ్రిడ్జి నిటారుగా పైకి లిఫ్ట్ అయ్యెలా నిర్మాణం చేశారు. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రైల్వే బ్రిడ్జి ప్రత్యేక గుర్తింపు దక్కింది.