టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు శనివారం చెపాక్‌లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను వీక్షించారు. మహీ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీ తరఫున ఆడుతుండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు హాజరైన నేపథ్యంలో మహీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదని, ధోనీ ఆటలో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రచారానికి తెరదించడం నా పని కాదు. నేను అతడితో కలిసి పని చేస్తున్నా. ధోనీ ఇంకా బలంగా ముందుకు సాగిపోతున్నాడు. ధోనీ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి నాకు తెలియదు. అది నేను అడగలేను కూడా. ధోనీ భవిష్యత్తు గురించి మీరే అడగాలి. ప్రస్తుతానికి మహీతో పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నా’ అని ఫ్లెమింగ్ చెప్పాడు. గత రెండు సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఎప్పటికపుడు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అనంతరం మహీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.