Perni Nani: ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారని విమర్శించారు. కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు.
Read Also: V Srinivasa Rao: ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ?
చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసిందని.. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని పేర్ని నాని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదన్నారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారని పేర్ని నాని ప్రశ్నించారు. 2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారని.. ఇప్పుడెందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని పేర్ని నాని తెలిపారు.