V Srinivasa Rao: అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. కేజీ టు పీజీ సిలబస్‌ని రివ్యూ చేయడం అంటే బీజేపీ మతోన్మాద ఎజెండాకి మద్దతిచ్చి విద్య కాషాయికరణకి అంగీకరించడమేనన్నారు.బీజేపి మాయలోపడి ముస్లింలకి నష్టం చేస్తున్న సీఏఏపై మాటమాత్రం ప్రస్తావించక పోవడం మైనార్టీలను వంచించడమేనని విమర్శించారు. సీపీఎస్ రద్దు పైన, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై అస్పష్టమైన హామీలు ఇచ్చారన్నారు.
సంపద పెంచుతామని చెబుతున్నారు తప్ప మేనిఫెస్టోలో ఎలా సంపద పెంచుతారో ఎక్కడా పేర్కొనలేదన్నారు. ముగ్గురు కలిసి పోటీ చేస్తూ, ముగ్గురు నాయకుల సమక్షంగా విడుదల చేస్తూ ఇది టీడీపీ- జనసేనల ఎన్నికల ప్రణాళిక అని చెప్పడం వింతగా ఉందన్నారు. ఈ ఎన్నికల ప్రణాళిక పట్ల బీజేపీ సానుకూలంగా ఉందని టీడీపీ- జనసేన నాయకులు చెప్పారు తప్ప బీజేపీ నాయకులు ఎటువంటి ప్రకటన లేదన్నారు. రెండు పార్టీలు పోటీపడి సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రజల్ని భ్రమల్లో పెట్టాలని చూస్తున్నాయన్నారు.
Read Also: AP Pensions: రేపటి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ
చదువుకున్న యువతకి ఉపాధి కల్పించే భరోసా ఇవ్వలేదన్నారు. విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం, చెత్త పన్ను, ఇంటి పన్నులను సమీక్షిస్తాం, పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రిస్తాం అని ప్రకటించారు.. పన్నుల భారం వేయమని, పన్నులు పెంచమని చెప్పలేదన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించలేదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు సమీక్షిస్తాం, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రకటనలపై టీడీపీ, జనసేన పార్టీలు తమ వైఖరి ప్రకటించాలన్నారు.