తెలంగాణ సీఎం ఎవరికి చెప్పాలనుకున్నారు? ఎవరికి క్లాస్ పీకారు..? తన మనుషుల భుజాన తుపాకీ పెట్టి… కొట్టాలనుకున్న వారిని కొట్టారా? ఏ విషయంలో ఆయన కోపం నషాళానికంటింది? ఎవర్ని ఉద్దేశించి తాజా హాట్ కామెంట్స్ చేశారు? నిన్న ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మొన్న ఎమ్మెల్యే జయవీర్…… వీళ్ళిద్దరికీ క్లాస్ పీకారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ… ఇద్దర్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే…ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులన్నదే. జయవీర్…పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుమారుడు… జానారెడ్డితో రేవంత్‌కు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జయవీర్ కూడా రేవంత్‌ను అన్నలా భావిస్తారని అంటారు. కానీ… గతంలో జరిగిన సిఎల్పీ సమావేశంలో జయవీర్‌ని టార్గెట్ చేసిమరీ క్లాస్ తీసుకున్నారు సీఎం. ఓవైపు మీటింగ్ జరుగుతుంటే… ఫోన్లు మాట్లాడటం… బయటకు వెళ్ళడం లాంటి పనులు ఎలా చేస్తారంటూ నిలదీశారట. ఇంత నాన్ సీరియస్ ఐతే ఎలాగంటూ… గట్టిగానే అన్నారట. అయితే.. ఆరోజే చాలా మందికి డౌట్ వచ్చింది. డైరెక్ట్‌గా మీటింగ్‌లో జయవీర్‌కు అంతలా క్లాస్ పీకాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరాలు తీశారట చాలామంది. ఫైనల్‌గా అక్కడ టార్గెట్ జయవీర్ ఒక్కరే కాదని, ఆయన మీద పెట్టి మిగతా ఎమ్మెల్యేలు అందరికీ తాను చెప్పాలనుకున్నది ముఖ్యమంత్రి చెప్పేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక రెండో అంశం.. తాజాగా మంగళవారం నాడు జరిగిన సిఎల్పీ మీటింగ్. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కి.. క్లాస్ పీకారు రేవంత్ రెడ్డి. మంత్రి వర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలల్‌రెడ్డికి పదవి ఇవ్వాలన్నట్టుగా గతంలో కామెంట్స్ చేశారు చామల.
అలాగే మల్ రెడ్డి రంగారెడ్డి ఎపిసోడ్‌లో కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఒక్కరే కాదు… మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలువురు నాయకులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…జానారెడ్డిని ఉద్దేశించి అన్న మాటల్ని కూడా కాస్త సీరియస్‌గానే తీసుకుంది పార్టీ. అటు మంచిర్యాల సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహిరంగ సభ వేదిక మీదనే మంత్రి పదవుల గురించి మాట్లాడటంతో పాటు…మరో ఎమ్మెల్యే వివేక్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. దీనికి కొనసాగింపుగా వివేక్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా పార్టీలో ముగ్గురు శాసనసభ్యులు కేబినెట్ విస్తరణ పై బహిరంగ కామెంట్స్ చేశారు. ఇవన్నీ ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయన్నది సీఎం అభిప్రాయమట. వీటిని ఇలాగే ఉపేక్షించి వదిలేస్తే… మరింత సంక్లిష్టత పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో సీఎల్పీ మీటింగ్ వేదికగా అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ.. సమావేశానికి… మంత్రి పదవుల కోసం మాటలు విసురుకుంటున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవలేదు. దీంతో పరిస్థితిని ముందే ఊహించి ముగ్గురూ సమావేశానికి దూరంగావున్నారా..? అనే చర్చ కూడా సిఎల్పీ సమావేశం ప్రాంగణం దగ్గర జరిగిందట. సదరు శాసనసభ్యులు మీటింగ్‌కి రాకున్నా ఫర్లేదుగానీ…. ఇండికేషన్ ఐతే గట్టిగా ఇవ్వాలనుకుని కాస్త సీరియస్ గానే స్పందించారట రేవంత్. తనకు సన్నిహితంగా ఉండే చామల కిరణ్ భుజం మీద తుపాకీ పెట్టి…తాను టార్గెట్ చేయాలనుకున్న వారిని చేసినట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా రెండు సందర్భాల్లో…. తన సన్నిహితుల వంకపెట్టి సీఎం చెప్పాలనుకున్నది చెప్పేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయ వర్గాల్లో.