Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ దాడిపై భారత్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే, పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధం ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, పాక్‌తో సరిహద్దుల్ని మూసేసింది. పాక్ పౌరులు దేశం వదిలివెళ్లాలని హెచ్చరించింది.
Read Also: Pahalgam Terror Attack: పాక్ పాత్రపై విదేశీ రాయబారులకు ఆధారాలు చూపించిన భారత్
ఓ వైపు భారతీయుల్ని చంపేశారని యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది నీచులు మాత్రం ఈ ఘటనను సమర్థిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు పాకిస్తాన్ తీరును సమర్థిస్తున్నారు. తాజాగా, పహల్గామ్ దాడిని సమర్థి్ంచినందుకు ‘నిచ్చు మంగళూరు’ అనే ఫేస్బుక్ వినియోగదారుపై కర్ణాటకలోని మంగళూరులో కేసు నమోదు చేయబడింది. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూర్‌కి చెందిన ఉల్లాల్ ప్రాంత వాసి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు నగరంలోని కోనాజే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో కంటెంట్‌ను ప్రచురించినందుకు, ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అశాంతిని ప్రేరేపించే లేదా హాని కలిగించే ప్రకటనలను ప్రసారం చేసినందుకు యూజర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం, 2023లోని సెక్షన్లు 192 మరియు 353(1)(b) కింద అభియోగాలు మోపారు. ఈ పోస్టులో కాశ్మీర్లో జరిగిన హత్యల్ని 2023 పాల్ఘర్ రైల్వే స్టేషన్ కాల్పులతో పోల్చారు, ఈ ఘటనలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి సీనియర్ సహోద్యోగితో సహా నలుగురిని కాల్చి చంపారు. బాధితుల్ని కాల్చే ముందు వారు ముస్లింలేనా అని అధికారి అడిగారని, ఆ సమయంలో అతడిని ఉరితీసి ఉంటే, పహల్గామ్ సంఘటన జరిగేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రోఫైల్ పిక్‌లో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.