ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బీజేపీ కండువా కప్పుకున్నారు. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. గన్నవరం సర్పంచ్ కూడా పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో పలు జిల్లాల కాంగ్రెస్, వైసీపీ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ మంచి పాలన కారణంగానే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు.
Also Read: Devineni Avinash: నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు!
‘సంస్ధాగతంగా మోర్చాలను బలోపేతం చేసుకుంటున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం పని చేస్తున్నాం. బీజేపీ మూల సిద్ధాంతం అంత్యోదయ. మహిళ, రైతు, యువతను అభివృద్ధి పథంలో నడిపించగిలితే వికసిత్ భారత్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా 10 లక్షల మందికి బీజేపీ ఉపాధి కల్పించింది. రాష్ట్రం ఇచ్చే సొమ్ము ఆలస్యం అవుతుందేమో కానీ.. కేంద్రం ఇచ్చేది వెంటనే రైతుల ఖాతాలకు వెళ్లిపోతుంది. నిన్న మొన్నటి వరకూ చట్టబద్ధత లేని బీసీ కమిషన్‌కు ప్రధాని మోడీ చట్టబద్ధత కల్పించారు. బీజేపీ సంపూర్ణంగా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని విపక్షాలు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. వాజ్ పేయ్ ప్రయత్నంతోనే అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే ఈ స్ధాయికి ఎదిగాను అని ప్రధాని మోడీ అన్నారు. 22 రాజ్యాంగ సవరణలు బీజేపీ అధికారంలో ఉండగా చేస్తాం’ అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.