బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించటం మంచిది కాదు అని చెప్పారు. ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుంది అని ఆయన పేర్కొన్నారు. కరెంట్ కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారం కిందనే మేము నల్గొండ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.. ఇది చూసిన కాంగ్రెస్ భయపడి నిన్న సభలో తీర్మానం చేశారు.. మా సభ నుంచి దృష్టి మరల్చేందుకు ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తోంది అని కడియం శ్రీహరి ఆరోపించారు.
Read Also: Mouni Roy: మౌని రాయ్ అందాల మెరుపులు..
కృష్ణ నదిపై ఉన్న హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉంది అని కడియం శ్రీహరి అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నల్గొండ సభకు వెళ్తున్నాం.. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, రైతులు వస్తున్నారు.. ఇవాళ్టి నుంచి జల యుద్ధం ప్రారంభమైంది అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ది రేవంత్ రెడ్డి సర్కార్ కు కనిపించడం లేదన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి వెల్లడించారు.