Ravi Shastri on Rohit Sharma Captaincy vs South Africa: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో విఫలమైంది. రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 256/5 స్కోరు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా, డేవిడ్ బెడింగ్‌హామ్ (56) హాఫ్ సెంచరీ బాదాడు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. బౌలర్లను వినియోగించుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహం బెడిసి కొట్టిందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 49/1 స్కోరుతో ఉంది. లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభమైనప్పుడు ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌తో రోహిత్ శర్మ బౌలింగ్ చేయించాడు. ఓపెనింగ్ స్పెల్ వేసిన జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టాడు. ఇదే వ్యూహాత్మక తప్పిదం. సెషన్‌ను టాప్ బౌలర్లతో ఆరంభించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇదే చేశాం. రెండో సెషన్ ఆరంభంలో భారత్ చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే. రోహిత్ అలా చేయాల్సింది కాదు’ అని అన్నాడు.
Also Read: MS Dhoni: ఎంతో కష్టంగా ఉన్నా.. నా అభిమానుల కోసమే ఇదంతా: ధోనీ
సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే అభిప్రాయాన్న వ్యక్తం చేశాడు. భారత జట్టు ఈ విషయంలో పొరపాటు చేసిందని.. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తప్పకుండా దీనిపై దృష్టిసారించాలన్నాడు. లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరూ మాట్లాడుకునే ప్రసిధ్, శార్దూల్‌తో బౌలింగ్ చేయించి ఉంటారని మంజ్రేకర్ పేర్కొన్నాడు. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రాకు కాస్త విశ్రాంతినివ్వాలని రోహిత్, రాహుల్ భావించి ఉంటారన్నాడు.