India Wicketkeeper is KS Bharat in IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రాహుల్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డేల్లో కీపింగ్ చేస్తున్న రాహుల్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీపింగ్ చేస్తాడా లేదా అన్న సందిగ్ధతకు తెర పడింది. ఇక వికెట్ కీపర్, బ్యాటర్ స్థానం కోసం తెలుగు ఆటగాడు కేఎస్ భరత్, యువ ప్లేయర్ దృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది.
‘ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటం లేదు. కీపింగ్ ఎంపికలో మేము స్పష్టంగా ఉన్నాము. అందుకే మరో ఇద్దరు వికెట్ కీపర్‌లను ఎంచుకున్నాము. దక్షిణాఫ్రికాలో రాహుల్ జట్టు కోసం చాలా కష్టపడ్డాడు. సిరీస్‌ని డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంగ్లండ్‌పై కేవలం బ్యాటర్‌గా కొనసాగుతారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు కీపర్లలో ఒకరు ఆడుతారు. భారత్‌లోని పిచ్‌లలో స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపింగ్ చేయగల ఆటగాడిని ఎంచుకుంటాం’ అని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
Also Read: BCCI Awards 2024: ఉత్తమ క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్.. రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం!
రాహుల్ ద్రవిడ్ ఇంటర్వ్యూ అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఎవరన్న చర్చ మొదలైంది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ సాధన చేశారు. అయితే అనుభవం దృష్ట్యా భరత్‌కే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశముంది. ఆంధ్ర ఆటగాడు అయిన భరత్ గతేడాది ఫిబ్రవరి- మార్చిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో కీపర్‌గా రాణించాడు. అంతేకాదు భారత్ పిచ్‌లపై కీపింగ్ చేసిన అనుభవం మనోడికి కలిసి రానుంది. మొత్తానికి రాహుల్ తప్పుకోవడంతో భరత్‌కు లైన్ క్లియర్ అయినట్లే. గురువారం నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే.