కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.. క్రమంగా అందరికీ వ్యాక్సిన్ వేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది సర్కార్.. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నవారికే జీతాలు, వ్యాక్సిన్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్ వేసుకుంటేనే ట్రావెలింగ్ అవకాశం అంటూ పలు షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ముంబైలో సబర్బన్ రైళ్లలో ప్రయాణానికి ప్రత్యేక స్థానం ఉంది.. కోవిడ్ మహమ్మారికి ముందు రోజుకు దాదాపు 80 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ రైళ్లలో ప్రయాణించేవారు.. కోవిడ్‌తో ఆ పరిస్థితి మారిపోయింది.. ప్రస్తుతం కొన్ని రైళ్లను మాత్రమే తిప్పుతుండగా.. ఈ నెల 28వ తేదీ నుంచి 100 శాతం సామర్థ్యంతో సబర్బన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అయితే, దీపావళి తర్వాత లోకల్ రైళ్లలో ప్రయాణించేవారు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా వేసుకుని ఉండాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అవసరమైన కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించడానికి పూర్తి టీకా (రెండు డోసుల వ్యాక్సిన్) తప్పనిసరి అని స్పష్టం చేసింది. కోవిడ్ పాజిటివ్ కేసులు అదుపులో ఉంటే, లోకల్ రైళ్లు, మాల్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రజల రాకపోకలపై ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తుంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ మరియు కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్‌తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి రెండు డోసుల మధ్య 84 రోజుల సమయం ఉండటం ప్రజలకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తోందంటున్నారు అధికారులు.. ఇక, సెంట్రల్ రైల్వే మరియు వెస్ట్రన్ రైల్వే అక్టోబర్ 28 నుండి ముంబైలో 100 శాతం సామర్థ్యంతో సబర్బన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం అయ్యాయి.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.