సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, జ్యోతిష్యాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటీనటులు ఇతర ప్రముఖుల జాతకాలు చెప్పడంతో పాటు వారి మూవీ కెరీర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఫేమస్ అయ్యారు. కానీ అందుకు సంబంధించిన నటీనటుల ఫోటోలు బయటకు రావడం, ఆ తర్వాత వారు సాధించే విజయాలకు ఆ పూజలే కారణమని ప్రచారం జరగడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే నటి ప్రగతి ఈ విషయం పై ఘాటుగా స్పందించగా, తాజాగా టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి సైతం వేణుస్వామి పూజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : The Raja Saab: ‘సలార్’ మిస్ అయినా ‘రాజా సాబ్’తో కల నెరవేరింది!
‘కేవలం పూజలు చేయడం వల్ల ఎవరూ స్టార్ హీరోయిన్లు అయిపోరు. మేము గుడికి ఫ్యామిలీతో కలిసి వెళ్తాము.. కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారని పూజలు చేస్తాము, అంతకు మించి ఏమీ లేదు. ఈ పూజ చేస్తే అలా అయిపోతారు అని చెప్పే మాటలు నేను నమ్మను. కష్టం లేకుండా విజయం రాదు’ అంటూ డింపుల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ మరియు ఫేక్ న్యూస్‌పై స్పందిస్తూ..
‘ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన ఒకరి కెరీర్ మారిపోదు, నా పక్కన ఉన్న వారికి నా గురించి తెలుసు’ అని తెలిపింది. ప్రస్తుతం రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటిస్తున్న డింపుల్, జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.