గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి జడలు విప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు లక్షణాలతో బాధితులు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో నిత్యం 20-30 మంది డెంగీ లక్షణాలతో వెళ్తున్నారు. ఢిల్లీలో ఇటీవల భారీ వానలు కురిశాయి. తగ్గిన తర్వాత అక్కడ భారీగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, మరోవైపు హైదరాబాద్ లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి డెంగీ కేసులు 250కు దాటినట్లు తెలుస్తోంది.
Read Also: Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. సెప్టెంబర్లో ఈ రేంజ్ ధరలు ఉండొచ్చు
హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి ప్రతి 20 ఓపీ కేసుల్లో 3-5 మందికి డెంగ్యూ నిర్ధారణ కేసులు వస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబరులో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. డెంగ్యూ బారిన పడి చికిత్స తీసుకోవడం కంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి సోకకుండా ఎవరికి వారు కాపాడుకోవచ్చునని సూచిస్తున్నారు.
డెంగ్యూ వ్యాధి వల్ల ప్లేట్‌లెట్లు తగ్గడం కంటే రక్తపోటు వస్తుంది. జ్వరం వచ్చి తగ్గుముఖం పట్టినప్పుడు ప్లేట్‌లెట్లు తగ్గడం, బీపీ పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. రోగుల్లో రక్తపోటు పర్యవేక్షిస్తూ.. తగ్గితే వెంటనే ఫ్లూయిడ్స్ అందించాలని డాక్టర్లు చెప్పారు. కొందరిలో ఒకటి రెండు రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. కొందరిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వెన్నెముక, కండరాళ్ల నొప్పులు, కనుగుడ్ల వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో జ్వరం వస్తే.. వెంటనే ఎన్‌ఎస్1 యాంటిజన్ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.