దేశంలో డీప్‌ఫేక్ వీడియోల కేసుల సంఖ్య రోజు రోజుకు వేగంగా పెరుగిపోతున్నాయి. ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
సాంకేతిక అధారంగా వీడియో ఎక్కడ అప్‌లోడ్ చేయబడిందో అని ఐపీ అడ్రస్ గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. తమకు అవసరమైన ఆధారాలు లభించాయి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ వెల్లడించారు. వివాదానికి తెరతీసిన వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం త్వరలో కొత్త నిబంధనలను తీసుకువస్తుందని చెప్పారు. డిటెక్షన్, ప్రివెన్షన్, రిపోర్టింగ్, యూజర్లపై అవగాహన పెంచేందుకు కొన్ని కంపెనీలు అంగీకరించాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు.