Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది.. ఇదే సమయంలో.. ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది.. మరో వారం రోజుల్లో పోలింగ్.. పదిరోజుల్లో ఫలితాలు వెలువడనుండగా.. విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు కనిపిస్తారు.. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు.. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం.. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి..
ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంకు కొంత ఉంటుంది. వీళ్లు, అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు.. పార్టీకోసం చమటోడ్చే కార్యకర్తల నుండి, సానుభూతిపరుల వరకు ఈ కేటగిరీలోకి వస్తారు.. ఈ ఓట్లకు ఎప్పుడూ ఢోకా ఉండదు.. ఎటొచ్చీ, సమయం, సందర్భాన్ని అనుసరించి.. అప్పటి సమస్యలు, ప్రస్తుత అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా ఓటెవరికి వేయాలో డిసైడ్ చేసుకునే ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్లే గెలుపోటముల్ని డిసైడ్ చేయటంలో కీలకం.. వీళ్లను ప్రసన్నం చేసుకోవటానికి పార్టీలన్నీ తంటాలు పడుతుంటాయి.. గెలుపు సాధ్యం కాదని తెలిసినా, బరిలో ఉండే అభ్యర్థులు చాలామంది ఉంటారు.. ఇండిపెండెంట్ల నుండి, ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల వరకు అనేకమంది కనిపిస్తారు. వీళ్లే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోరు నడుస్తోంది. కానీ, ఈ మూడు పార్టీలకు తోడు అనేకమంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఏదైనా సమస్యను ప్రజల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పోటీ చేసే అభ్యర్థులు కొందరున్నారు. అదే సమయంలో గెలవకపోయినా, తమ బలాన్ని నిరూపించుకోవాలని చూసే చిన్న పార్టీలు.. కూడా రంగంలో ఉన్నాయి.. ఈ అభ్యర్థులంతా కొన్ని వందల నుండి వేల వరకు ఓట్లను చీలుస్తారు.
ఈ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరివి? ఎవరికి పడాల్సినవి? ఎవరికి కనపడని దెబ్బకొడతారు..? ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత, నిరుద్యోగులు కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని, గెలుపోటములు తారుమారు అవుతాయని అభ్యర్థులు కలవరపడుతున్నారు.
ఇప్పుడు తెలంగాణలో బర్రెలక్క ఓ సంచలనంగా మారింది..గ్రాడ్యుయేట్ అయిన శిరీష చిన్న వీడియోతో బర్రెలక్కగా మారింది. సామాజిక మాధ్యమాల్లో లక్షలమంది ఫాలోయర్లను సంపాదించుకుంది. నిజానికి ఆమె వాయిస్ వ్యక్తిగతం కాదు.. ఆమెను అనుసరిస్తున్న లక్షలమంది ఆకాంక్షలకు ప్రతీక అనే గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా హల్‌చల్ ని దాటి ఎన్నికల గోదాలోకి బర్రెలక్క వస్తుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఆమెను చూసి పెదవి విరిచిన వాళ్లున్నారు.. అత్యాశతో, అమాయకత్వంతో పోటీ చేస్తోందన్నారు. కానీ, పది రోజుల్లో ఆమెపై ఉన్న అంచనాలు మారిపోయాయి.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. శిరీష తాను గెలుస్తాననే నమ్మకంలో ఉంది.. అదే సమయంలో ఆమె గెలుపుపై చాలా మందికి నమ్మకం ఉండకపోవచ్చు.. కానీ, ఆమె ఇప్పుడు కొల్లాపూర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీలుస్తుందనే విషయాన్ని మాత్రం అందరూ నమ్ముతున్నారు. ఆ ఓట్లు ఎవరికి పడాల్సినవి? ఎవరి గెలుపోటముల్ని ఆమె తలక్రిందులు చేయబోతోంది. ఇదే ఇప్పుడు ప్రశ్న
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తున్న అనూహ్య మద్దతుతో శిరీష రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. సోషల్ మీడియాతో పాటు, క్షేత్ర స్థాయిలో కూడా బర్రెలక్క సత్తా చాటుతోంది. తొలుత లైట్ తీసుకున్న ప్రధాన అభ్యర్థులు కూడా ఇప్పుడామెను చూసి భయపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక వాదన అయితే, ఆమెకు మద్దతు తెలుపుతున్నవారిలో యువత అధికంగా ఉండటంతో, బీఆర్‌ఎస్ కూడా అదే స్థాయిలో నష్టపోతుందనే వాదన కూడా ఉంది. నామినేషన్లకు ముందు వరకు ఇది జూపల్లి, బీరం మధ్య పోరుగా భావించి మిగతా అన్ని నియోజకవర్గాల మాదిరిగానే దీన్నీ లెక్కేశారు. కానీ, బర్రెలక్క ఎంట్రీతో ఇక్కడి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆమె పేరు అందరి నోళ్లలో నానుతోంది. దీంతో పాటు కేసీఆర్, కేటీఆర్ తోపాటు, ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు కూడా ఆమెపై విమర్శలు చేస్తుండడంతో ఆమె మరింత వార్తల్లోకి వచ్చింది.
బర్రెలక్కతో పాటు, ఇతర నియోజకవర్గాల్లో మరికొందరు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.. ఏళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని గల్ఫ్ కార్మికులు ఆవేదనలో ఉన్నారు.. ఇప్పుడు తమ సమస్యలకు గొంతివ్వడానికి అయిదుగురు స్వతంత్రులుగానో, చిన్నపార్టీల అభ్యర్థులుగానో పోటీచేస్తున్నారు. వీరే కాకుండా, ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరొక చోట ఒక ఎన్నారై యువతి, ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోరులో కనిపిస్తున్నారు. గెలిచినా, గెలవకున్నా, ఒక సమస్యను సమాజం దృష్టికి తీసుకురావటానికి ఓటు పోరాటాన్ని సాధనంగా భావించి పోటీలో ఉన్నారు. వీరంతా ఎంతో కొంత ఓట్లను సాధించుకోవటం ఖాయం. ఈ అభ్యర్థులు బరిలో లేకుంటే, ఈ ఓట్లన్నీ ప్రధాన పార్టీల్లో ఏదో ఒక దానికి పడే అవకాశం ఉంటుంది.
కానీ, ఇప్పుడు చీలిక తప్పదని తేలింది.. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రమాదం, ఎవరికి ప్రమోదం.. ఇదే ఇప్పుడు బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలను టెన్షన్ పెడుతున్న అంశం.. ఒకటి రెండు స్థానాల్లో ఇలాంటి ప్రమాదం ఉంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.. కానీ, 119 స్థానాల్లో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, మరికొన్ని చోట్ల సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు.. ఇంకా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు. మొత్తంగా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరికి కనిపించకుండా దెబ్బకొడుతుందో మరి పదిరోజుల్లో తేలిపోయే అంశం.