CPI – Congress Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం కాక రేపుతోంది.. బీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగగా.. బీజేపీ-జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించాయి.. అయితే, జనసేన సీట్ల వ్యవహారం తేలాల్సి ఉంది.. మరోవైపు.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఆది నుంచి జరుగుతూనే ఉంది.. దీని కోసం కమ్యూనిస్టులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరుపుతూ వచ్చారు.. కానీ, సాగదీత దోరణితో విసుగుచెందిన సీపీఎం.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. 17 చోట్ల పోటీకి సిద్దమని ప్రకటించింది. ఇక సీపీఎం బాటలోనే సీపీఐ కూడా వెళ్లే అవకాశముంది. ఇవాళ జరగనున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌ను నమ్మలేమంటున్నారు సీపీఐ నేతలు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తే.. అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టబోమని సీపీఎం తెలిపింది. అలాగే వామపక్షాలు పోటీ లేని స్థానాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది సీపీఎం.
మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ హ్యాండివ్వడంతో పొత్తుపై వెనక్కి తగ్గింది సీపీఎం. పైగా కాంగ్రెస్ నేతలు అవమానకరంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 17 చోట్ల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. మొదట్లో ఐదు స్థానాలను ఆశించిన సీపీఎం.. తగ్గుతూ వచ్చింది. కనీసం రెండు చోట్లయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పాలేరు సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్‌ను కోరారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. అయితే మిర్యాలగూడ, వైరా సీట్లను ఇస్తామని హామీ ఇచ్చి మాట మార్చారు కాంగ్రెస్ నేతలు. మిర్యాలగూడ లేదా హైదరాబాద్‌లో ఏదో ఒకచోటు నుంచే పోటీ చేయాలని సూచించడంతో పొత్తు ప్రయత్నాలను విరమించుకున్నారు.
ఇక, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పినా.. మారన రాజకీయ పరిస్థితులు, బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది.. చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని వివేక్ కు కేటాయించే అవకాశం ఉండడంతో.. సీపీఐ కూడా డైలామాలో పడిపోయింది.. దీంతో.. కాంగ్రెస్‌తో తేల్చుకునేందుకు సిద్ధమైంది సీపీఐ.. ఇప్పటికే సీపీఎం కటీఫ్ చెప్పడంతో.. సీపీఐ కూడా అదే దారిలో నడుస్తుందనే చర్చ సాగుతోంది.. అయితే, కొందరు కాంగ్రెస్ నేతలు కమ్యూనిస్టులకు సీట్లు ఎందుకు.. మా ప్రభుత్వం వచ్చాక.. ఒకటో రెండో ఎమ్మెల్సీలు ఇస్తాం.. ఎమ్మెల్యే సీట్లు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.. ఏది ఏమైనా.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే.. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే.. కాదనుకుంటే.. కాంగ్రెస్ పార్టీకే నష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.