తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బతుకమ్మ చీరలు సూరత్‌లో తెచ్చారు.. కమిషన్లు మింగి దోపిడీకి పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. మరోవైపు.. స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు మంచి చీరలు ఇస్తామని.. కోఠి ముప్పై లక్షల చీరలు చేనేతకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. ఆడబిడ్డలకు తమకు అత్మ బంధం ఉందని అన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఏదైనా యూనివర్సిటీ వెళ్ళారా..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులను వీసీలను పెట్టిండు కానీ.. ఓయూయూనివర్సిటీకి ఎప్పుడైనా దళితుడిని వీసీ చేశారా..? అని దుయ్యబట్టారు.
మీ కులం గొప్పది అనుకుంటున్నారు.. కానీ ఇతర కులాన్ని తక్కువ చేసి చూడటం ఎంటి..? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభను గౌరవించరు.. వ్యక్తులను గౌరవించరని తెలిపారు. అడ్డగోలు తనమే గొప్ప అనుకుంటున్నారని దుయ్యబట్టారు. దుబాయ్‌లో ఫ్రెండ్ చనిపోతే అక్కడే అంత్యక్రియలు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది.. దీపావళికి డ్రగ్స్ వాడే సంసృతి వాళ్ళదని ఆరోపించారు. దుబాయ్ నుండి అన్ని వివరాలు తెప్పించామని తెలిపారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటాపెడతానన్నారు. దుబాయ్ గుట్టు అంతా తన దగ్గర ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లు, పార్టీలు ఇచ్చే దోస్తులు కావాలి మీకు అని దుయ్యబట్టారు. మేము నోటిఫికేషన్ ఇస్తే ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు అంటున్నారు.. తోక మిగిలింది అని అంటున్నారు. తోకనే తియ్యలేని వాడివి నువ్వేందుకు అని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.
ఏడాదిన్నరలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తమదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట్ల కూడా ఇన్ని ఇవ్వలేదు.. తెలంగాణలో 22.9 శాతం నిరుద్యోగ సమస్య నుండి 18.1 శాతం నిరుద్యోగ సమస్య తగ్గిందని అన్నారు. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 నియామకాలు త్వరలోనే ఉంటాయని చెప్పారు. 40 రోజుల్లో నియామక పత్రాలు ఇస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్.. సభలో ఉండి ఆయన అనుభవాలు చెప్తే వినే వాడినని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన అనుభవాలు తీసుకునే అలవాటు తనకు ఉందని పేర్కొన్నారు. కానీ దిగు.. నీకు తెలివి లేదు అంటున్నాడని సీఎం అన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్నలాంటి వాడేనని తెలిపారు. ప్రధానిని కలిసే సంస్కారం మీకు లేకపోవచ్చు.. కానీ తనకు ప్రధానిని కలిసే సంస్కారం ఉందని చెప్పారు. 32 సార్లు కాకుంటే 300 సార్లు ఢిల్లీకి పోతానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూనే ఉంటా.. కిషన్ రెడ్డితో సహా అందరూ కేంద్ర మంత్రులను కలిశానని ముఖ్యమంత్రి పేర్కొ్న్నారు.
పరిపాలన మీద పట్టు లేదు అంటున్నాడు.. పరిపాలన మీద పట్టు అంటే పాలసీలు తేవడమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముద్ర వేసి మంత్రిని తొలగించడం కాదని తెలిపారు. అధికారులను తొలగించడం కాదు.. అదే పరిపాలన మీద పట్టు అంటేనని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు.. లగచర్లలో కంపెనీలు పెడదాం అనుకుంటే కలెక్టర్‌ను కొడితిరి.. దాడి చేస్తే కేసులు పెడితే.. ఎందుకు కేసులు పెట్టినావు అంటున్నారు.. దాన్ని కూడా తప్పు పడితే ఏం చేస్తాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీకు రక్షణ కావాలి.. కానీ అధికారులను కాపాడొద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రండి.. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత తనది అని రేవంత్ రెడ్డి అన్నారు. నీ అనుభవం చెప్పు నేను తీసుకుంటానని సీఎం తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పులకు అసలు రూ.88,591 కోట్లు.. చెల్లించిన మెత్తి రూ.64768 కోట్లు.. 15 నెలల్లో లక్ష 53 వేల కోట్లు కట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.4682 కోట్లు తాము చేసిన అప్పు అని.. లెక్క పక్కగా చెప్తున్నానన్నారు. తాము చేసిన అప్పులు, కేసీఆర్ తప్పులు సరిద్ధిదడానికే సరిపోయిందని అన్నారు. తాము చేసిన అప్పులు, ఆయన చేసిన అప్పుల గురించే ఎక్కువ ఖర్చు చేశామన్నారు. తాను పారదర్శకంగా ఉండాలని అనుకుంటున్నానని.. అబద్దాల పునాదుల మీద రాష్ట్రాన్ని నిలబెట్టమని చెప్పారు. మా బాసులు ప్రజలు.. మా బాసులు ఫాం హౌస్‌లో లేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.