Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సర్వేను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిర్వహించిందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. అయితే, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కావాలని సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో సర్వే అధికారులపై కొందరు కావాలని కుక్కలు వదిలారని ఆయన తెలిపారు. కుల గణన సర్వేపై అనవసర అపోహలు పుట్టించవద్దని పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీలను మరింత బలపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీల గురించి ఎవరు మాట్లాడినా, వారిని చులకన చేయొద్దని తెలిపారు. తమ ప్రభుత్వానికి బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లేదని, ఏ పని చేసినా పూర్తి చిత్తశుద్ధితో చేస్తామన్నారు.
Also Read: Allu Aravind : దేవి శ్రీ ప్రసాద్‌ని వద్దు అనడానికి కారణం ఇదే : అల్లు అరవింద్
అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంకు హాజరైన నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం కావడంలో తప్పేమీ లేదని, తమ పార్టీ నేతలు కలిసి చర్చించడం సహజమని తెలిపారు. “కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైతే తప్పా?” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశం కావడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలతో సమావేశమైతే తప్పు అని చెప్పొచ్చని, కానీ తమ పార్టీ నాయకుల భేటీని తప్పుబట్టడం అనుచితం అని వ్యాఖ్యానించారు. అనురుద్ రెడ్డి తనకు ఫోన్ చేసినప్పటికీ, తాను ఆ సమావేశానికి హాజరుకాలేదని నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని చర్చలకు దారి తీసే అవకాశముంది.