అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా నేపథ్యంలో మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కెనడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై జస్టిన్ ట్రూడో తొలిసారి స్పందించారు. తన రాజీనామాను ప్రకటించిన ట్రూడో, కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశం లేదని అన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, భద్రతా భాగస్వామిగా ఉండటం వల్ల రెండు దేశాలలోని కార్మికులు, కమ్యూనిటీలు ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు.
ట్రూడోతో పాటు, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా ఈ విషయంపై ప్రకటన ఇచ్చారు. “మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలు బలంగా ఉన్నారు. బెదిరింపుల నేపథ్యంలో మేం ఎప్పటికీ వెనక్కి తగ్గం.” అని ట్వీట్ చేశారు. కెనడాలో ప్రతిపక్ష నాయకుడు పియరీ పౌలివేర్ కూడా ఈ విషయంపై ప్రకటన ఇచ్చారు. “మనది గొప్ప, స్వేచ్ఛాయుత దేశం. అమెరికాకు మంచి స్నేహితులం. అల్-ఖైదా 9/11 దాడులకు ప్రతిస్పందనగా అమెరికన్లకు సహాయం చేయడానికి మేము బిలియన్ల డాలర్లు వెచ్చించాం.” అని పేర్కొన్నారు.
కాగా.. కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా అనంతరం నూతనంగా ఎన్నికైన ట్రంప్ మరోసారి విలీన అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ‘‘కెనడాలో మెజారిటీ ప్రజలకు 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం కావడం ఇష్టమే. ఆ దేశంతో భారీ వాణిజ్యలోటును, ఇస్తున్న రాయితీలను అమెరికా ఇక ఎంతోకాలం భరించలేదని జస్టిన్ ట్రూడోకు తెలుసు కాబట్టే, రాజీనామా చేశారు. అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవు. నిరంతరం చుట్టుముట్టి ఉండే రష్యా, చైనా నౌకల ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చు’’ అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా తెలిపారు. ఈ అంశంపై కెనడా నేతలు స్పందించారు. ట్రంప్ ప్రకటనపై పలువురు కెనడా స్థానిక నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.