Botsa Satyanarayana: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్, ఎమ్మెల్యేల సమావేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి మాటగా చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రభుత్వం కాలం రెండున్నర ఏళ్లు అని అర్థం అవుతుందన్నారు. అందుకే సంక్రాంతి వరకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇద్దామనే మా ఆలోచన మార్చుకున్నామన్నారు. ఈ ప్రభుత్వానికి సమయం తక్కువగా ఉన్నందున ఎన్నికల హామీల అమలు కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల హామీలను ఎప్పుడు నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రజల తరపున వైసీపీ డిమాండ్ చేస్తోందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు టన్ను ఇసుక 475 రూపాయల లెక్క రీచ్‌ల్లో అందుబాటులో వుండేదన్నారు.
తగ్గించిన ఇసుక ధరలు ఎప్పుడు నుంచి అమలు చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక రీచ్‌ల దగ్గర ధరల పట్టిక ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చెప్పే మాటలు వాస్తవానికి దగ్గరగా వుండాలన్నారు.వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మీద రూ. 750 కోట్లు ఆదాయం చూపించామన్నారు. గత ప్రభుత్వంలో ప్రాణాలు తీశాయని ప్రచారం చేసిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లో వున్నాయని.. వీటిని ఎందుకు కట్టడి చెయ్యలేదని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు ఆకాశంలోనూ.. మద్యం ధరలు భూమికి- ఆకాశానికి మధ్య ఉన్నాయన్నారు. ప్రభుత్వం లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. వ్యవసాయం మీద ప్రభుత్వం మానిటరింగ్ చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలు మార్కెట్లో కొనుక్కునే దుస్థితిలో రైతులు ఉన్నారన్నారు. తాను చాలా ప్రకృతి వైపరీత్యాలు చూశానన్న బొత్స.. కోటిన్నర అగ్గిపెట్టెలకు ఖర్చు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.
Read Also: YS Jagan: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది.. వైఎస్ జగన్ ట్వీట్
రాష్ట్రంలో అర్థాయుష్ ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల తరఫున పోరాటం ప్రారంభించడం అనివార్యమని.. యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర మద్యం ధరలు అధికంగా వున్నాయన్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని ప్రభుత్వం భావిస్తుంటే వాళ్ళ ఇష్టమని.. కానీ ప్రజలు నష్టపోతున్నారని గుర్తించాలన్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10మంది మృతికి నిర్వహణ లోపమే కారణమని బొత్స సత్యనారాయణ అన్నారు అంతర్గత విభేదాల కారణంగా మంచినీటి పంపిణీని నిర్లక్ష్యం చెయ్యడం కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. మద్యం, ఇసుకలో అక్రమాలు జరుగుతుంటే అధినాయకత్వం పట్టించుకుంటుందా అంటూ ప్రశ్నించారు. విశాఖ డ్రగ్స్ కేసులో ప్రధాన మంత్రి, హోం మంత్రిని కలిసి లేఖను అందజేస్తానన్నారు. ఆపరేషన్ గరుడలో ఇంటర్ పోల్, సీబీఐ హ్యాండిల్ చేసిన కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందో చెప్పాలని అడుగుతానన్నారు. జమిలి ఎన్నికల వరకు స్టీల్ ప్లాంట్ ను ప్రస్తుత ప్రభుత్వం ఆపగలిగితే ఆ తర్వాత మేం పరిరక్షించుకుంటామన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన చెయ్యాల్సిందే… గోదావరి జిల్లాల సమన్వయకర్తగా పనిచేస్తానని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.