YS Jagan: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేదని విమర్శించారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమన్నారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Read Also: Minister Kandula Durgesh: నిడదవోలులో ఆర్వోబీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
లిక్కర్, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారన్నారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కూటమి సర్కారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందన్నారు. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని జగన్ తెలిపారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారన్నారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని ఆయన పేర్కొన్నారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారన్నారు. విలేజ్‌క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారన్నారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయని.. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 19, 2024