పశ్చిమ బెంగాల్‌లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
అయితే.. బాంబులను నిర్వీర్యం చేసేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు పోలీసులు సమాచారం అందించారు. అయితే ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ సెంటర్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు రికవరీ చేయడంపై యంత్రాంగం ఆందోళన చెందుతోంది. శనివారం ఉదయం పోలీసులు రాయ్‌పూర్‌లోని ఖిదిర్‌పద శ్మశానవాటిక, దోమ్‌కల్‌లోని నిశ్చింత్‌పూర్, ఫర్జిపాడా ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అక్కడ 16 బాంబులు ఉన్నట్లు గుర్తించారు. సాకెట్ బాంబులు, బాంబుల తయారీకి వాడే పదార్థాలను నైలాన్ బ్యాగుల్లో పెట్టి ప్లాస్టిక్ బకెట్లలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
ఐసీడీఎస్ కేంద్రం వెనుక ప్లాస్టిక్ సంచులలో బాంబులు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. బాంబుల ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మూడో దశలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్, ముర్షిదాబాద్ రెండు స్థానాలకు, పొరుగు జిల్లాలోని మాల్దా నార్త్, సౌత్ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. కాగా.. ఈ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది.
RCB vs GT: బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్లు ఇవే!
మరోవైపు.. బాంబు రికవరీ తర్వాత రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. దొంకల్ జోనల్ కమిటీ కార్యదర్శి ముస్తాఫిజుర్ రహమాన్ మాట్లాడుతూ.. తృణమూల్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. స్వయంగా బాంబులు పెట్టి, ప్రతిపక్షం పేరుతో తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే.. రక్తపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ డోమ్‌కల్ బ్లాక్ ప్రెసిడెంట్ హాజికుల్ ఇస్లాం తెలిపారు. ప్రజలు అట్టడుగు స్థాయి అభివృద్ధిని చూసి ఓటేస్తారని.. ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం లేదని, ‘బాంబు సంస్కృతి’ అసలు ప్రతిపక్షాలదేనని అన్నారు. అక్కడక్కడ బాంబులు పెట్టి పోలీసులకు సమాచారం ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ముర్షిదాబాద్ లోక్‌సభ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అందుకే ముర్షిదాబాద్‌పై కమిషన్ అదనపు నిఘా పెట్టింది. మూడో రౌండ్ ఓటింగ్‌లో కూడా ముర్షిదాబాద్‌లో అత్యధిక కేంద్ర బలగాలు ఉంటాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి 190 కంపెనీల సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు.