Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు బీదర్‌లో దొంగనోట్ల ముద్రణ ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ముద్రించిన నకిలీ నోట్లే ఎన్నికల సమయంలో పంపిణీ చేసినట్లు ఆరోపించారు. తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అప్పులపాలైందని, ప్రస్తుతం రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని ప్రభుత్వమే అంగీకరిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూములు అమ్మకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, కమీషన్ల వ్యవస్థ మరింత పెరిగి 15 నుంచి 18 శాతానికి చేరిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఆ హామీలను అమలు చేయడానికి కనీసం రూ.8 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని విమర్శించారు. కాంగ్రెస్ విధానాలను చూస్తే మరికొన్ని నెలల్లో ఉద్యోగులకు జీతాల కోసం కూడా తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి గట్టి ప్రతిస్పందన ఎదురవుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. రైతుల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం బాగుపడదని, రైతులు నిశ్చయిస్తే ప్రభుత్వాలే మార్చగలరని అన్నారు. నరేంద్రమోడీ (PM Modi) నేతృత్వంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌పీవో (FPO) వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అవసరమని ఆయన తెలిపారు.