Bandi Sanjay: తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీఆర్‌కు చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్ రాకతో ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఆదిలాబాద్ బైపాస్ నుంచి పట్టణం మీదుగా 13 కి.మీల మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్ సమక్షంలో భారీ ఎత్తున జిల్లా నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం మహిళలపై సాగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ కరెంట్ కట్ చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం స్పందించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల పక్షాన ఎంతకైనా తెగిస్తూ పోరాడుతోంది బీజేపీనేనని ఈ సందర్భంగా అన్నారు. మేం అధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా సభలో కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.
‘హిందుత్వం విషయంలో నో కాంప్రమైజ్. నా దారి రహదారి…బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడతా. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టారు. మజ్లిస్ నేతలకు దమ్ముంటే ఆదిలాబాద్ జిల్లా సహా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాషాయ జెండా భగభగలకు పచ్చ జెండా మాడిమాసై పోక తప్పదని హెచ్చరించారు. జనార్దన్ రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన సభలో బీఆర్ఎస్ సీనియర్ నేత రఘుపతికి కాషాయ కండువా కప్పి బండి సంజయ్ బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు దారట్ల జీవన్, దుర్గం రాజేశ్వర్, గంటా సంతోష్, శివ, నాగేందర్, రాజు, సతీష్, కేశవ్ పటేల్, క్రాంతి పటేల్, మోహన్, జైపాల్, రామన్ రాజు, దశరథ్ సహా వందలాది మంది నాయకులు శనివారం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసినీరెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మిస్టర్ ఇండియాను చూశాను… కానీ ఇక్కడ మిస్టర్ 40 శాతం కమీషన్ మంత్రిని చూస్తున్నానంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో తాగడానికి నీళ్లు లేవు, సౌకర్యాల్లేవంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడ్డారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను అభివ్రుద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిమ్స్ కు రూ.130 కోట్లు ఇస్తే.. స్టాఫ్ లేరు, సౌకర్యాల్లేకుండా చేస్తున్నారు. ఈ జిల్లా అభివ్రుద్ది చెందాలంటే రామరాజ్యం రావాలి. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
“చనాకా – కొరటా ప్రాజెక్టు అంచనాలు పెంచి కమీషన్లు దోచుకుంటున్నరు. కానీ ఇక్కడి వాళ్లకు చుక్క నీరు రాలేదు. పిప్పల్ కోట బ్యారేజీ కోసం వెయ్యి ఎకరాలిచ్చిన రైతులకు నాలుగేళ్ల క్రితం ఎకరాకు రూ.8 లక్షలలిస్తే… ఇప్పుడు రూ.7 లక్షలే ఇస్తానంటూ రైతుల ఉసురు తీసుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఒక్కరికీ ఉద్యోగమియ్యలే. నిరుద్యోగ భృతి ఇస్తానన్నడు. ఒక్కరికీ ఇయ్యలే. మరేం చేయాలి. కేసీఆర్ సర్కార్ ను తీసుకుపోయి కుంటాలలో విసిరిపారేద్దాం. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాక్ అయ్యింది. మీరంతా కలిసి ఆ పార్టీని షేక్ చేయాలి. నరేంద్రమోదీ ఈ ఏడాదిలోనే 10 లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చింది. రోజ్ గార్ మేళాతో గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలను అపాయింట్‌మెంట్లతో భర్తీ చేశారు. కానీ కేసీఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా?. ఇక్కడ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలే. ఆయన మాత్రం 100 రూముల ఇల్లు కట్టుకున్నడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. దీంతోపాటు ఉచిత విద్య, వైద్యం కూడా అందిస్తాం. అంతేగాదు పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమాకింద పంట నష్ట పరిహారం చెల్లిస్తాం. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం దోచుకుంటోంది. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా, పత్తాల దందా చేస్తోంది. దేశమంతా కేసీఆర్‌ను చూసి నవ్వుతోంది. ప్రజల కష్టాల పట్టని కేసీఆర్ రాత్రింబవళ్లు తాగడం తప్ప చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీలైన రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడానికి డబ్బుల్లేవన్నడు.. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.20 లక్షల అప్పు భారం మోపిండు. తెలంగాణలో అప్పులు తీరాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బీజేపీ అధికారంలోక రావాల్సిందే. ” -బండి సంజయ్