ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఏపీకి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై బిల్ గేట్స్‌తో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు.
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా బిల్ గేట్స్ ఉన్నారు. ఏపీకి వివిధ రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సుపరిపాలన, ఉపాధి కల్పన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు చర్చల అనంతరం ఏపీ గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.