సీఎం చంద్రబాబుతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా కేంద్రం మారిన నేపథ్యంలో.. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మండిపల్లితో సీఎం చెప్పారు. రాయచోటి అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. రాయచోటిని అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తానని మంత్రి మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు.
ఈరోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి మండిపల్లిని సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకుంటే తలెత్తే సాంకేతికపరమైన ఇబ్బందులను వివరించారు. ఈ క్రమంలోనే రాయచోటి అభివృద్ధిని తాను ప్రత్యేకంగా చూసుకుంటానని సీఎం చంద్రబాబు మంత్రి మండిపల్లికి హామీ ఇచ్చారు. మండిపల్లి రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Sonam Yeshey T20 Record: టీ20 క్రికెట్‌లో నయా చరిత్ర.. 8 వికెట్స్ పడగొట్టిన బౌలర్!
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అనంతరం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. గత 15 గంటల్లో తనతో నాలుగు సార్లు సీఎం చంద్రబాబు మాట్లాడారన్నారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే చాలా బాధపడ్డానని, రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయిందని పేర్కొన్నారు. జరిగిన పొరపాటు, గ్రహపాటుకు తాను కూడా బాధ్యడినే అంటూ.. రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్పారు. మంత్రి పదవి తన ఆశ కాదని.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షే ముఖ్యం అని మంత్రి మండిపల్లి చెప్పుకొచ్చారు.