Rain Alert: ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. రుతుపవనాలు ప్రారంభమైనందుకు చాలా మంది ఢిల్లీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
మహారాష్ట్ర
మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో పాటు ప్రాణనష్టం కలుగుతోంది. బుధవారం ముంబయిలోని మలాద్ ప్రాంతంలో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తిని కౌశల్ దోషి (38)గా గుర్తించామని, భారీ వర్షం కారణంగా చెట్టు కూలిపోయిందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలోని థానే, పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని, దీని ఫలితంగా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిందని, అనేక చెట్లు పడిపోయిన సంఘటనలు ఉన్నాయని అధికారులు గురువారం తెలిపారు. గత రెండు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి, కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. బుధవారం భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో కారు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.
గుజరాత్
నైరుతి రుతుపవనాలు మంగళవారం గుజరాత్‌ను పూర్తిగా కవర్ చేశాయి. అదే రోజు, దక్షిణ గుజరాత్ జిల్లాలు నవ్సారి, వల్సాద్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది, ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి, సాధారణ జనజీవనం ప్రభావితమైంది. ఉదయం కార్యాలయ వేళల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉత్తర బెంగాల్‌లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గోవా
గోవాలోని కొన్ని ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిశాయి, వాతావరణ శాఖ గురువారం వరకు కోస్తా రాష్ట్రానికి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసింది. నిర్దిష్ట ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాఖండ్‌లో, జూలై 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రుతుపవనాల ప్రారంభం కారణంగా రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.