Nitish Kumar: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చారు. ఇండియా కూటమి రూపశిల్పుల్లో ఒకరిగా ఉన్న నితీష్ కూటమి నుంచి వైదొలగడం ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లోని 40 ఎంపీ స్థానాలను స్వీప్ చేయాలని బీజేపీ-జేడీయూ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాయి.
తాజాగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బీహార్‌లోని జముయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒకే వేదికపై పీఎం మోడీ, సీఎం నితీష్ కుమార్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తాను శాశ్వతంగా ఎన్డీఏ(నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్)లో ఉంటానని స్పష్టం చేశారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ‘‘వారు తప్పు చేయడం నేను చూశాను, అందుకే ఆర్జేడీని వదిలేశాను. ఇక ఎప్పటికీ మేము(జేడీయూ-బీజేపీ) కలిసి ఉంటాము’’ అని అన్నారు.
Read Also: Onion Export: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ.. 5 దేశాలకు మాత్రం అనుమతి..
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ-ముస్లిం అల్లర్లు ఆగిపోయానని అన్నారు. ‘పీఎం మోడీ 10ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉండీ బీహార్‌కి, దేశానికి ఎంతో కృషి చేశారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ-ముస్లిం అల్లర్లు ఆగిపోయాయి, మీరు పొరబాటున మళ్లీ ప్రతిపక్షాలకు ఓటేస్తే అల్లర్లు తిరిగి మొదలవుతాయి.’’ అని బీహార్ ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ మా డిమాండ్ కర్పూరీ ఠాకూర్‌కి మీరు భారతరత్నం ప్రదానం చేశారు. దీనిని బీహార్ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు.
ఆర్జేడీ 15ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయలేదని, వారి హయాంలో సాయంత్రం తర్వాత ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. బీహార్ లోక్‌సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.