West Bengal: బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టుకోవడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. ఇలా ఒక మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) బీజేపీపై విరుచుకుపడింది. బెంగాల్‌లో చంచల్‌లోని సిహిపూర్ గ్రామంలో ముర్ము ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన ఓ యువతికి ముద్దు పెట్టిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
Read Also: Mamata Banerjee: యూసీసీ, సీఏఏ, ఎన్ఆర్‌సీలను బెంగాల్‌లో అనుమతించం. ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ..
దీనిపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మాల్దా అభ్యర్థి మహిళను ముద్దు పెట్టుకోవడాన్ని ఖండిస్తున్నామని, బీజేపీ నేతలు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. అయితే, ఈ ఘటనలో సదరు యువతి స్థానిక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీ నేతకు మద్దతుగా నిలిచారు. ఇది ఖగెన్ ముర్ము తనపై చూపించిన ఆప్యాయతగా ఆమె అభివర్ణించింది. ‘‘ మానాన్న వయసులో ఉన్న వ్యక్తి తనపై అభిమానం చూపి నా బుగ్గపై ముద్దు పెడితే ఇందులో తప్పేముంది..? మనుషులు ఇంత నీచంగా ఎందుకు ఆలోచిస్తున్నారు..? ’’ అని ఆమె అన్నారు.
2019లో బీజేపీలో చేరిన మాజీ సీపీఎం ఎమ్మెల్యే ముర్ము కూడా ఆ మహిళ తన బిడ్డలాంటిదని తన చర్యను సమర్థించుకున్నారు. అయితే, దీనిపై టీఎంసీ మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి బెంగాలీ మహిళలపై అసభ్యకరమూన పాటలు పాడే నేతల వరకు బీజేపీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవ లేదని, వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఊహించుకోండి అంటూ టీఎంసీ వ్యాఖ్యానించింది.