Mamata Banerjee: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. గురువారం ఈద్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు బృందాలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. దేశం కోసం రక్తం చిందించేందుకు తృణమూల్ సిద్ధంగా ఉందని, అయితే హింసను మాత్రం సహించబోమని అన్నారు.
Read Also: Truong My Lan: దేశంలోనే అతిపెద్ద మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తకు మరణశిక్ష..!
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోల్‌కతాలోని ఓ మసీదులో ముస్లిం వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూసీసీ ఆమోదయోగ్యం కాదని, నేను అన్ని మతాల సామరస్యాన్ని కోరుకుంటున్నానని, మీ భద్రత, మీ జీవితం కోసం మేము సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలను అంగీకరించమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముస్లిం నేతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మీరు ముస్లిం నేతల్ని పిలిచి మీకేం కావాలో చెప్పండి అని అడుగుతున్నారని, వారికి ఏం వద్దని, ప్రేమ కావాలని నేను అంటున్నానని ఆమె సభలో అన్నారు. ఎన్నికల సమయంలో కొంతమంది అల్లర్లను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారికి ప్రణాళికలకు బలి కావొద్దని ఆమె సూచించారు.
తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తు్న్నామని, ఢిల్లీలో ఇండియా కూటమి ఉండేలా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటోందని ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు. మరోవైపు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వానికి పాల్పడుతోందని ఆరోపించారు. హిందూస్తాన్ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకు చెందినదని అన్నారు, దీనిని ఎవరూ సొంతం చేసుకోలేరని వ్యాఖ్యానించారు.