Manipur Violence Cases: మణిపూర్‌లోని హింసాకాండకు సంబంధించిన కేసులను అస్సాంలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసింది. మణిపూర్ హింసాకాండకు సంబంధించిన కేసుల విచారణను పక్క రాష్ట్రాల్లో చేపట్టాలని సూచించిన సుప్రీంకోర్టు.. సీబీఐ విచారణను అస్సాంలో చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణకు సంబంధించి అవసరమైన న్యాయాధికారుల(జడ్డి)ను నియమించాలని గౌహతి హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా లైంగిక హింసకు పాల్పడిన కేసులతో పాటు మొత్తం 17 కేసులను సీబీఐ విచారించనుంది. అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేర విచారణ, న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులని అస్సాంకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: Gandeevadhari Arjuna : డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?
ఇంటర్నెట్ కనెక్టివిటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. అస్సాంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించింది. కుకీ, మైతీ రెండు తెగల వారూ ఎంతో నష్టపోయారు. కొండల్లో, లోయల్లో, అంతటా బాధితులు ఉన్నారు. అందుకే ఇరు వర్గాలకూ న్యాయంగా ఉండేలా తర్వాత అదేశాలిస్తామని పేర్కొంది. బాధితులు, సాక్షులను కోర్టుకు పిలవకుండా వీడియో కాన్ఫరెన్స్‌తోపాటు ఇతర మార్గాల్లో వర్చువల్‌గా విచారించాలని ధర్మాసనం పేర్కొంది. ఫస్ట్ క్లాస్ లేదా గౌహతి, అస్సాం సెషన్స్ కోర్టులో పని చేస్తున్న ఒకరు, లేదా ఇద్దరు జ్యుడీషియల్ మేజీస్ర్టేట్‌లను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేయాలని, మణిపూర్‌లో మాట్లాడే ఒకటి రెండు భాషలు తెలిసిన వారైతే మంచిదని సూచించింది. నిందితుల హాజరు, రిమాండ్, కస్టడీ, దాని పొడిగింపు వంటి విచారణ ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లో జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దూరం, భద్రత తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ప్రయాణ సమస్య కారణంగా నిందితులకు మణిపూర్ లోనే జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి, స్టేట్‌మెంట్ నమోదు తదితరాల కోసం మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఒకరు, లేదా ఇద్దరు మేజిస్ట్రేట్‌లను నియమించాలి. దోషుల గుర్తింపు పరేడ్‌లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు అనుమతించింది. అలాగే సోదాలు, అరెస్ట్ వారెంట్‌లను కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేయొచ్చని సూచించింది. జస్టిస్ గీత మిట్టల్ సారథ్యంలోని ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ప్యానల్ సజావుగా పని చేసేందుకు అనువైన ఆదేశాలను సెప్టెంబర్ 1న జారీ చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.