ప్రభుత్వ రంగం, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. పెద్ద మొత్తం డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటును 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లు మినహా అన్ని డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్బీఐ సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. అయితే.. వీటితోపాటు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటుని కూడా 4 శాతం నుంచి 5 శాతం వరకు పెంచుతున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.
రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 5-10 ఏళ్ల కాలపరిమితి, 3 – 5 ఏళ్ల కాలపరిమితులపై వడ్డీ రేటు 4.50 శాతానికి ఈ నిర్ణయంతో పెరిగింది. తాజా పెంపునకు ముందు ఈ కాలపరిమితుల వడ్డీ రేటు 3.60 శాతంగా ఉందని ఎస్బీఐ పేర్కొంది. కాగా 2-3 ఏళ్ల కాలపరిమితి బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.25 శాతానికి పెరగనుండగా.. పెంపునకు ముందు ఈ కేటగిరీ వడ్డీ రేట్లు 3.60 శాతంగా ఉన్నాయని ఎస్బీఐ తెలిపింది. ఇక 1-2 ఏళ్ల కాలపరిమితిపై గత వడ్డీ 3.60 శాతం ఉండగా తాజాగా అది 4 శాతానికి పెరుగనుంది. మరోవైపు 46 -179 రోజులు, 180-210 రోజుల కాలపరిమితుల వడ్డీ రేటు 3.50 శాతానికి పెరగనుందని వివరించిన ఎస్బీఐ.. ఇక 210 – నుంచి ఒక ఏడాది కాలపరిమితి డిపాజిట్ వడ్డీరేటు 3.75 శాతానికి చేరిందని తెలిపింది.