Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే, మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఆర్ఎస్ఎస్ పత్రిక ‘‘ది ఆర్గనైజర్’’ వ్యతిరేకించింది. “నాగరిక న్యాయం” కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తన వైఖరిని తెలియజేసింది. ఆర్గనైజర్ తాజా ఎడిషన్‌లో ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ మసీదు వివాదం గురించి కవర్ స్టోరీని అందించింది. షాహీ జామా మసీదు ఒకప్పుడు ఆలయమని ప్రస్తావించింది. చారిత్రాత్మకంగా ఆక్రమించబడిన లేదా కూల్చివేయబడిన మతపరమైన ప్రదేశాలకు సంబంధించిన సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకమని వాదించింది.
Read Also: Anna University Incident: ఉదయనిధి స్టాలిన్‌తో అత్యాచార నిందితుడు.. ఫోటోలు షేర్ చేసిన బీజేపీ..
‘‘అన్ని వర్గాల మధ్య శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి, నాగరిక న్యాయాన్ని సాధించడానికి చరిత్ర మరియు ఇతిహాసపై నిజమైన అవగాహన చాలా అవసరం. నాగరిక న్యాయం కోసం ఈ అన్వేషణను పరిష్కరించే సమయం ఆసన్నమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరమైన పరిష్కారాలను అందించడం ద్వారా కుల ఆధారిత వివక్ష యొక్క మూలాన్ని పరిష్కరించి, వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నించారు’’ అని ఆర్గనైజర్ తన సంపాదకీయంలో పేర్కొంది. కొంతమంది వలసవాద ఉన్నతవార్తలు, నకిలీ మేధావులు, లౌకిక వాదం యొక్క లోపభూయిష్టతను కొనసాగించాలని కోరుకుంటున్నారని, న్యాయాన్ని, సత్యాన్ని తెలుసుకునే హక్కుని తిరస్కరించడం ద్వారా రాడికలిజం, వేర్పాటువాదం, శత్రుత్వానికి ఆజ్యం పోస్తుందని కథనం పేర్కొంది.
ఇటీవల, పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణాన్ని అనుసరించి కొంతమంది వ్యక్తులు అలాంటి వివాదాలను రేకెత్తించడం ద్వారా తాము “హిందువుల నాయకులు” అవుతారనే భావనలో ఉన్నారని అన్నారు.