TPCC President Revanth Reddy Fired on BJP and TRS Governments.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు వివరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని కేంద్రం చూసిచూడనట్లుగా ఉందని, సింగరేణి దోపిడీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సింగరేణి కార్పోరేషన్లో నియమ నిబంధనలు ఉల్లంఘించి టెండర్లు ప్రతిమా శ్రీనివాస్, కేసీఆర్ గ్యాంగ్ కు కట్టబెట్టిన తీరుపై సీబీఐతో విచారణ జరపాలన్నారు.
ఆదానీ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా, కేంద్రానికి 49 శాతం వాటాలున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోడి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణి సీఎండిగా శ్రీధర్ 8వ సంవత్సరం కూడా కొనసాగుతున్నారని, కేంద్రం అనుమతి లేనిదే ఒక అధికారిని ఎలా కొనసాగిస్తారన్నారు. ఆదానీని అడ్డంపెట్టుకుని ఒరిస్సాలోని నైనీ బొగ్గు గనులను ప్రతిమా శ్రీనివాస్ కు కట్టబెట్టారని, సింగరేణి కుంభకోణం పై సీబీఐ విచారణ చేపట్టకపోతే ఇక కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.