Work From Home: తమ రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మహిళలకు వేతనం ఎంత ఇవ్వాలనేది ఆయా సంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. 20 శాతం మంది మహిళలను వర్క్ ఫ్రమ్ హోమ్ నియమించుకున్న సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం అందిస్తుందని వివరించారు. ఈ పథకానికి రాజస్ధాన్ ప్రభుత్వం రూ 100 కోట్ల కేటాయించింది. ఆరు నెలల్లో 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
Read Also: Vijayawada: వైరల్ వీడియో ఎఫెక్ట్.. విద్యార్థిని కాలితో తన్నిన లెక్చరర్ సస్పెండ్
కాగా ఇప్పటివరకూ 150 మంది మహిళలు, 9 కంపెనీలు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యాయని అధికారులు తెలిపారు. అయితే సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల మహిళలకు మరో వరం ప్రకటించారు. తమ రాష్ట్రంలో మహిళలకు మూడేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలతో త్వరలో స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ చేయనున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. దాదాపు 1.35 లక్షల కుటుంబాల్లో మహిళలకు వీటిని త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు, టెండర్ల ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. ఇందుకోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోటీ పడుతోంది.