Vijayawada: విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని భాస్కర్ భవన్ క్యాంపస్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని లెక్చరర్ కాలితో తన్నిన ఘటన సంచలనం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యార్థిని చెంపలపై కొట్టడంతోపాటు కాలితో తన్నిన లెక్చరర్‌ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. తరగతిలో తోటి విద్యార్థితో మాట్లాడినందుకు ఓ విద్యార్థిని శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్ అందరి ముందు చెంపపై కొట్టడంతో పాటు కోపం తాళలేక కాలితో తన్నాడు. ఈ ఘటనను తరగతిలోని మరో విద్యార్థి వీడియో తీసి తల్లిదండ్రులకు పంపడంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఘటనను జిల్లా విద్యాశాఖ, చైల్డ్‌లైన్ అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటర్ బోర్డు స్థానిక ఇన్‌స్పెక్టర్ రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక కళాశాలకు వెళ్లి ఈ ఘటనపై ఆరా తీశారు.
కాగా తరగతి గదిలో సదరు విద్యార్థి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడని, ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో కోపం వచ్చి కొట్టినట్లు లెక్చరర్ వివరించాడు. అయితే తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. అలాంటప్పుడు తమ కుమారుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినే అవకాశమే ఉండదని వాదిస్తున్నారు. కట్టడి పేరుతో విద్యార్థులను దండించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ మేరకు సదరు లెక్చరర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్‌ఐఓ వెల్లడించారు.