Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, పీఎం మోడీని టార్గెట్ చేశారు. భారత్ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు.
Read Also: World Cup Final Loss: వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి.. బంగ్లాదేశ్లో సంబరాలు..!
జలోర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ ఒక ‘‘చెడు శకునం’’ అని అన్నారు. ప్రధాని మోడీ వెళ్లడం వల్లే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందని విమర్శించారు. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ… ‘‘మన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ గెలుచుకున్నారు.. కానీ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసింది’’ అంటూ దుయ్యబట్టారు.
నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ని అధికారం నుంచి దించాలని బీజేపీ, మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధానంగా కులగణన హమీని ఇస్తుంటే.. బీజేపీ రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలను అడ్డుకుంటామని, కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామని ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.