PM Modi: దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానంపై ఆసక్తి ఉన్నవారు ‘‘జెఎఫ్‌కే ఫర్‌గటెన్ క్రైసిస్’’ బుక్ చదవాలని ప్రధాని మోడీ మంగళవారం పార్లమెంట్లో అన్నారు. ఈ పుస్తకం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడ, అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య సమావేశం గురించి తెలియజేస్తుంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రి జైశంకర్‌ని నాలుగైదు సార్లు ప్రధాని మోడీ అమెరికాకు పంపారని సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ తీరు, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘JFK’s Forgotten Crisis: Tibet, the CIA and the Sino-Indian War’ అనే బుక్‌ని మాజీ సీఐఏ అధికారి బ్రూస్ రీడెన్ రాశారు. ఇది 1962 లో ఇండియా-చైనా యుద్ధం గురించి వివరిస్తుంది. చైనాకు వ్యతిరేకంగా యుద్ధ విమానాలు అందించాలని నెహ్రూ కెన్నడీకి ఎలా లేఖలు రాశారనేదానిని వివరించింది.
Read Also: KTR : 2014లో కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టారు.. ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది
చైనా సరిహద్దు వివాదాన్ని నిర్వహించడంలో విఫలమయ్యారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లకు సమాధానంగా ఈ రోజు మోడీ మాట్లాడారు. దేశ భద్రత విషయంలో నెహ్రూ ఏ ఆటలు ఆడారో ఈ పుస్తకం వెల్లడిస్తుందని ఆయన అన్నారు. ఎవరికైనా విదేశాంగ విధానంపై నిజంగా ఆసక్తి ఉంటే వారు జేఎఫ్‌కే ఫర్‌గటెన్ క్రైసిస్ పుస్తకాన్ని చదవాలని అన్నారు.
ఈ పుస్తకంలో దేశం సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు నెహ్రూ ఎలాంటి విదేశాంగ విధానాన్ని అవలంబించారనే దానిని వివరిస్తుంది. ఈ పుస్తకంలో నెహ్రూ గురించి అమెరికన్ అధికారి వివాదాస్పద అంశాలను రాశారు. ‘కెన్నడీ 27 ఏళ్ల సోదరి’ అయిన ‘పాట్ కెన్నడీ’ పట్ల నెహ్రూ ఎలా ఆసక్తి చూపించారో పుస్తకంలో వివాదాస్పదంగా ఉంది. భారతదేశ చివరి వైస్రాయ్ భార్య లేడీ ఎడ్వినా మౌంట్‌బాటన్ తరచుగా ఉపయోగించే గెస్ట్ హౌజ్‌లో నెహ్రు బస చేసేందుకు ఆసక్తి చూపించారని పుస్తకంలో బ్రూస్ రీడెన్ రాశారు.