LK Advani: బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ఎల్‌కే అద్వానీకి ఈ అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ ఢిల్లీలోని ఆయన నివాసంలో లడ్డూ అందించి అభినందించారు.
‘‘అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం లభించినందుకు తమ కుటుంబం సంతోషంగా ఉందని, ఈ రోజు తాను అమ్మను మిస్ అవుతున్నానని, తన తండ్రి వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో ఆమె చేసిన సహకారం చాలా ముఖ్యమైనది. నేను భారతరత్న గురించి దాదా(అద్వానీ)కి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారని, ఆయన జీవితమంతా దేశ సేవలోనే గడిపారని’’ అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ చెప్పారు. అవార్డు గురించి వెల్లడించిన సమయంలో ఆయన కళ్లలో కన్నీరు తెచ్చుకున్నట్లు ఆమె చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో కూడా ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. తన జీవితంలో ఆయన చేసిన కృషికి ఇంటి ఘనమైన గుర్తింపు లభించడం అద్భుతమని ఎల్‌కే అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ అన్నారు.
Read Also: Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే
అంతకుముందు అవార్డును ప్రకటిస్తూ ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ‘‘మన కాలంలో అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞుల్లో ఒకరు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పని చేయడం నుండి దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం ప్రారంభించబడింది. మన ఉప ప్రధాన మంత్రి. ఆయన మన హోం మంత్రిగా మరియు I&B మంత్రిగా కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవిగా ఉన్నాయి. భారతరత్న ప్రకటించడం నాకు ఉద్వేగభరితమైన క్షణం. అతని నుంచి నేర్చుకోవడానికి నాకు లెక్కలేని అవకాశాలు లభించడం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను’’ అని ప్రధాని మంత్రి అన్నారు.