Former Union Minister Sharad Yadav Dies At 75: ప్రముఖ సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి, జేడీయూ వ్యవస్థాపక సభ్యుడు శరద్ యాదవ్(75)కన్నుమూశారు. చాలా కాలంగా శరద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఢిల్లీలో తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి శరద్ యాదవ్ అపస్మారస్థితిలోకి వెళ్లారు. పల్స్ లేకపోవడంతో సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. రాత్రి 10.19 గంటలకు మరణించినట్లు వెల్లడించారు.
Read Also: High Extreme Wave: రాకాసి అల.. ఏకంగా నాలుగు అంతస్తుల ఎత్తు
విద్యార్థి నాయకుడిగా రాజకీయాలను ప్రారంభించిన శరద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు. జేపీ ఉద్యమంలో పాల్గొన్నారు. తన జీవితంలో ఎక్కువ భాగం ప్రతిపక్షంలోనే కొనసాగారు. తన రాజకీయ ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ లో ఇటీవల సయోధ్య కుదుర్చుకున్నారు. 2015లో జేడీయూ, ఆర్జేడీ మహాకూటమి ఏర్పాటులో కీలకంగా ఉన్నారు. శరద్ యాదవ్ అంతకుముందు ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఏడు సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నియ్యారు. బీహార్ లో నితీష్ కుమార్ తో కలిసి జేడీయూ పార్టీని స్థాపించారు. అయితే జేడీయూ, బీజేపీతో చేతులు కలపడంతో జేడీయూ నుంచి బయటకు వెళ్లారు.
2018లో సొంతగా లోక్ తాంత్రిక్ జనతా దళ్ పార్టీని ప్రారంభించారు. ఆ తరువాత రెండేళ్లకు లాలూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీలో దాన్ని విలీనం చేశారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ‘‘శరద్ యాదవ్ మరణంతో బాధపడ్డాను. తన సుదీర్ఘ సంవత్సరాల ప్రజా జీవితంలో, అతను ఎంపీగా మరియు మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డాక్టర్ లోహియా యొక్క ఆదర్శాల నుండి అతను గొప్పగా ప్రేరణ పొందాడు. ఓ శాంతి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు. సింగపూర్ ఆస్పత్రిలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ వీడియో సందేశానన్ని పంపారు. తానూ, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ ముగ్గురం రామ్ మనోహర్ లోహియా మరియు కర్పూరీ ఠాకూర్ నుండి సోషలిజం రాజకీయాలను నేర్చుకున్నామని అన్నారు.