High Extreme Wave: వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. అందుకు అనుగుణంగానే మహాసముద్రాలు ప్రవర్తిస్తున్నాయి. భారీ అలలు ఎగిసి పడుతున్నాయి. సుమారు నాలుగు అంతస్తుల ఎత్తున్న భారీ స్థాయి కెరటాన్ని పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు. 2020 నవంబర్‌లో బ్రిటీష్ కొలంబియాలోని ఉక్లూలెట్ జలాల్లో 17.6 మీటర్ల ఎత్తైన అల ఎగసిపడినట్లు సముద్రంలో ఏర్పాటు చేసిన పరికరం రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఉక్లూలెట్ తీర ప్రాంతం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని యాంఫిట్రైట్ వద్ద ఏర్పాటు చేసిన మెరైన్ ల్యాబ్ సెన్సార్లు దీనిని గుర్తించినట్లు అందులో పేర్కొన్నారు.
Read Also: China Accident: చైనాలో ఘోరం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు
కాగా, ఇప్పటి వరకు రికార్డైన అత్యంత ఎత్తైన అసాధారణ అల ఇదేనని పరిశోధకుడు డా. జోహన్నెస్ గెమ్రిచ్ తెలిపారు. 1,300 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి భారీ స్థాయి అలలు ఏర్పడతాయని ఆయన అంచనా వేశారు. ఇలాంటి అత్యంత ఎత్తైన అలలు సముద్ర కార్యకలాపాలు, ప్రజలకు ఎంతో ప్రమాదకరమని చెప్పారు. మరోవైపు అసాధారణ స్థాయి అలలను అంచనా వేయడం కూడా కష్టసాధ్యమని మెరైన్‌ల్యాబ్స్ సీఈవో డా. స్కాట్ బీటీ తెలిపారు. అయితే భారీ స్థాయి అలలు ఎప్పుడు, ఎక్కడ ఏర్పాడతాయో అన్నది తెలుసుకునేందుకు తమ డాటా సహకరిస్తుందని చెప్పారు. తద్వారా పెద్ద అలల వల కలిగే ముప్పును ఎదుర్కోవచ్చని ఆ నివేదికలో పేర్కొన్నారు. కాగా, 1995లో నార్వే సముద్ర తీరంలో సుమారు 12 మీటర్ల ఎత్తైన అలను తొలిసారి గుర్తించారు.