కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇంకా తగ్గక ముందే.. ఓవైపు బ్లాక్ ఫంగస్.. మరోవైపు వైట్ ఫంగస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి.. బ్లాక్ ఫంగస్‌ను ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించిన కేంద్రం.. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.. ఆ కేసు నమోదు అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇక, ఇవాళ కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ సవాల్‌గా మారిందని.. వాటి నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాపై పోరాటం సమయంలోనే బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైందని.. దీనిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు పాటిస్తూ సిద్ధం కావాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.