J&K Terror Attacks: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు జైలుకు వెళ్తారు లేదా ‘నరకానికి’ వెళ్లారని రాజ్యసభలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని మోడీ సర్కార్ సహించబోదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరగుతున్న ఉగ్రదాడుల గురించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు ఎప్పటికీ విజయం సాధించలేరని మంత్రి చెప్పారు.
Read Also: Indra Re Release: మెగా ఫాన్స్.. పులకించిపోవడానికి రెడీ అవ్వండి!
గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, కొందరు భద్రతా సిబ్బంది కూడా మరణించారని, ఇది చాలా దురదృష్టకరమని నిత్యానంద రాయ్ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భద్రతా దళాలు ఈ ప్రాంతంలో సుమారు 900 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు చెప్పారు. ‘‘ మోడీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని సహించేది లేదని, ఉగ్రవాదులు జైలులో లేదా జహనుమ్(నరకం)లో ఉంటారని నేను సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని మంత్రి అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్న 2004-14 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో 7217 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. బీజేపీ అధికారంలో ఉన్న 2014 నుంచి ఈ ఏడాది జూలై 21 వరకు ఈ సంఖ్య 2259కి తగ్గిందని నిత్యానంద రాయ్ చెప్పారు. ఇలాంటి ఉగ్రదాడులు జరగకూడదని, వీటిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు.2004 నుంచి 2014 మధ్య కాలంలో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. 2014 నుంచి ఈ సంఖ్య 67 శాతం తగ్గిందని వెల్లడించారు. అంతేకాకుండు ఉగ్రవాద ఘటనలు 69 శాతం తగ్గాయని రాజ్యసభలో చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు, భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందన్నారు.