Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాజల్ మీల్, పీసీసీ ఉపాధ్యక్షుడు సుశీల్ శర్మ సహా పలువురు నేతలు పార్టీని వీడి ఆదివారం బీజేపీలో చేరారు. సూరత్ గఢ్ నంచి కాంగ్రెస్ తరుపున అసెంబ్లీకి పోటీ చేసిన హనుమాన్ మీల్, మాజీ పీసీసీ ఉపాధ్యక్షుడు అశోక్ అవస్తీలు బీజేపీ నాయకులు ఓంకార్ సింగ్ లఖావత్, నారాయణ్ పంచరియా మరియు అరుణ్ చతుర్వేది సమక్షంలో బిజెపిలో చేరారు.
Read Also: Chittoor Crime: మైనర్‌పై అత్యాచారం.. అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య
వర్గపోరు కారణంగా అంకితభావంతో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొందని సుశీల్ శర్మ ఆరోపించారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేశానని, అయితే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల మాట వినేవారు లేరన్నారు. అయోధ్య రామమందిర విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా సనాతన ధర్మాన్ని విశ్వసించే తనలాంటి కార్యకర్తలు నిరాశకు గురయ్యారని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన సత్తా నిరూపించుకుందని, దీని ప్రభావంతో జాతీయవాద ఆలోచనతో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల టికెట్ల విషయంలో పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మీల్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావాకు ఫిర్యాదు చేసినా కూడా వినలేదని చెప్పారు. జైపూర్‌లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు, రిటైర్డ్ అధికారులతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు బీజేపీలో చేరారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19,26 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.