Mamata Banerjee: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగే రోజే, పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ సర్వమత ర్యాలీని నిర్వహించింది. సోమవారం జరిగిన ఈ ర్యాలీ ముగింపులో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ మహిళలకు వ్యతిరేకమని విమర్శించింది. రాముడిని పొగుడుతున్న బీజేపీ సీతాదేవిని విస్మరించిందని మమతా ఆరోపించారు.
‘‘వారు రాముడి గురించి మాట్లాడతారు. కానీ సీతా దేవి గురించి విస్మరించారు. వనవాస సమయంలో రాముడితో పాటు ఆమె ఉంది. వారు స్త్రీలకు వ్యతిరేకం కాబట్టి ఆమె గురించి మాట్లాడరు. మేము దుర్గాదేవని ఆరాధిస్తాము. కాబట్టి వారు మతం గురించి మాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రయత్నించొద్దు’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల ముందు మతాన్ని రాజకీయం చేయడాన్ని నేను నమ్మను, అలాంటి పద్ధతిని వ్యతిరేకిస్తానని అన్నారు. శ్రీరాముడిని పూజించే వారిపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేసుకోవడం అభ్యంతరం ఉంటుందని అన్నారు.
Read Also: Meat Consumption: ప్రతీ ఏడాది 100 బిలియన్ల జంతువుల్ని తింటున్న మనుషులు..
టీఎంసీ పార్టీ కోల్‌కతా హజ్రా మోర్ నుంచి సర్వమత ర్యాలీని ప్రారంభించింది. ఈ ర్యాలీలో వివిధ మత పెద్దలు పాల్గొన్నారు. నగరంలోని పార్క్ సర్కస్‌లో భారీ సభతో ఈ ర్యాలీ ముగిసింది. బీజేపీ రాజకీయాలకు మతాన్ని జోడిస్తోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ, ప్రభుత్వం అటువంటి సిద్ధాంతాలకు దూరంగా ఉందని చెప్పారు. ఈ రోజు దేశానికి బెంగాల్ గర్వకారణం.. దేశం మొత్తం మత కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా.. బెంగాల్ ప్రజలు రోడ్డుపై నిలబడి శాంతి కోసం ప్రార్థనలు చేశారని, బెంగాల్‌లో మత రాజకీయాలు నడవవని, అందరికి సేవ చేయాలనే ఒకే మతం మాకుందని ఆయన అన్నారు.